MLC 2023: Washington Freedom Beats San Francisco Unicorns by 30 Runs - Sakshi
Sakshi News home page

#MLC2023: ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్‌ నేత్రావల్కర్‌?

Published Sun, Jul 23 2023 7:49 AM

MLC2023: Saurabh Netravalkar-6 Wickets Washington Freedom Won By 30 Runs - Sakshi

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC 2023)లో వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ మూడో విజయాన్ని నమోదు చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ బౌలర్‌.. భారత సంతతికి చెందిన సౌరబ్‌ నేత్రావల్కర్‌ ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని శాసించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొయిసిస్‌ హెన్రిక్స్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పియనార్‌ 29, అండ్రీస్‌ గౌస్‌ 23 పరుగులు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ మూడు వికెట్లు తీయగా.. ప్లంకెట్‌ రెండు, స్టోయినిస్‌ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్‌ నేత్రావల్కర్‌ బౌలింగ్‌ దాటికి టాపార్డర్‌ కకావికలమైంది. మధ్యలో కోరే అండర్సన్‌ (34 పరుగులు), ఆరోన్‌ ఫించ్‌ (14 పరుగులు) ప్రతిఘటించినప్పటికి లాభం లేకపోయింది. ఆ తర్వాత నేత్రావల్కర్‌ టెయిలెండర్ల పని పట్టడంతో శాన్‌ఫ్రాన్సిస్కో ఓటమి పాలైంది.

ఎవరీ నేత్రావల్కర్‌? 
భారత్‌ సంతతికి చెందిన సౌరబ్‌ నేత్రావల్కర్‌ ముంబై ప్రాంతంలో జన్మించాడు. అండర్‌-19 క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇక్కడ అవకాశాల్లేక అమెరికాకు వెళ్లిపోయాడు. మంచి లెఫ్టార్మ్‌ పేసర్‌గా ఎదిగిన నేత్రావల్కర్‌ ప్రస్తుతం అమెరికా జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. యూఎస్‌ఏ తరపున 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నేత్రావల్కర్‌ 48 వన్డేల్లో 73 వికెట్లు, 9 టి20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టుకు నేత్రావల్కర్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించడం విశేషం.

చదవండి: #LinDan: సినిమాల్లో 'డాన్‌'లు చాలా మందే.. బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక్కడే 'డాన్‌'

Advertisement

తప్పక చదవండి

Advertisement