IPL 2023: Akash Madhwal Deserves All The Credit For Taking MI To Qualifier 2: Mohammad Kaif - Sakshi
Sakshi News home page

ముంబై క్వాలిఫయర్‌కు చేరడానికి ప్రధాన కారణం అతడే: భారత మాజీ క్రికెటర్‌

Published Thu, May 25 2023 9:16 PM

Mohammad Kaif: Akash Madhwal Bowling Style Resembles Shami - Sakshi

IPL 2023- Akash Madhwal: ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌పై టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్‌ స్టైల్‌ భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని గుర్తుకు తెచ్చిందన్నాడు. కీలక మ్యాచ్‌లో ఎంతో పరిణతి కలిగిన పేసర్‌లా అద్భుతంగా రాణించి ముంబైని గెలిపించాడని కొనియాడాడు.

ఆకాశమే హద్దుగా ఆకాశ్‌ విజృంభణ
ఐపీఎల్‌-2023 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌- ముంబై ఇండియన్స్‌ బుధవారం తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

అద్భుత:
ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఆరంభంలోనే చుక్కలు చూపించాడు ఆకాశ్‌ మధ్వాల్‌. ఓపెనర్‌ ప్రేరక్‌ మన్కడ్‌ను పెవిలియన్‌కు పంపి ముంబైకి శుభారంభం అందించాడు. అదే జోరులో మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

మొత్తంగా 3.3 ఓవర్లు బౌల్‌ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి సంచలన ప్రదర్శనతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. లక్నో మీద గెలుపుతో ఐపీఎల్‌-2023లో రోహిత్‌ సేన మరో ముందడుగు వేసింది. క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

షమీ గుర్తుకొచ్చాడు
ఈ నేపథ్యంలో మహ్మద్‌ కైఫ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్‌ మధ్వాల్‌ సరైన లైన్‌అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేశాడు. అతడి బౌలింగ్‌ శైలి నాకు మహ్మద్‌ షమీని గుర్తు చేసింది. అద్భుతమైన పేసర్‌. ముంబైకి కాస్త ఆలస్యంగానైనా దొరికిన ఆణిముత్యం. ప్రతి మ్యాచ్‌లోనూ మెచ్యూర్‌గా బౌలింగ్‌ చేశాడు’’ అని ముంబై పేస్‌ సంచలనం ఆకాశ్‌ను కొనియాడాడు. 

ముంబై క్వాలిఫయర్‌ చేరడారికి కారణం అతడే: పఠాన్‌
ఇక మరో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం.. ‘‘ఇలాంటి కీలక మ్యాచ్‌లో అన్‌​క్యాప్డ్‌ ప్లేయర్‌ ఇంత అద్భుతంగా ఆడటం మునుపెన్నడూ చూడలేదు. గత రెండు మ్యాచ్‌లలోనే 9 వికెట్లు తీశాడు. ముంబైని క్వాలిఫయర్‌కు చేర్చిన ఘనత ఆకాశ్‌కే దక్కుతుంది’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. 

కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్‌ మధ్వాల్‌ ఐపీఎల్‌-2023 ద్వారా అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మే 26 నాటి క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది.

చదవండి: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌.. తెరమీదకు మయాంక్‌ అగర్వాల్‌ పేరు! కారణం?
Ind vs Aus: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ప్రాక్టీస్‌ షురూ చేసిన టీమిండియా

Advertisement
Advertisement