కొడితే బంతి ఎవరెస్ట్‌కు...  | Sakshi
Sakshi News home page

కొడితే బంతి ఎవరెస్ట్‌కు... 

Published Thu, Sep 28 2023 2:04 AM

Mongolia were bowled out by 273 runs - Sakshi

హంగ్జౌ: ఆసియా క్రీడల్లో నేపాల్‌ క్రికెట్‌ జట్టు అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పనికూనలాంటి ఆ జట్టు ఆటలో ఇప్పుడే నడక మొదలుపెట్టిన టీమ్‌పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించింది. పరుగుల వాన, పరుగుల వరద అనే విశేషణాలు ఈ మ్యాచ్‌కు సరిపోవు... విధ్వంసం, దూకుడు అనేవి కూడా చిన్న పదాలు... ఒకదాని తర్వాత మరో కొత్త మరో రికార్డు... పరుగులు, బంతులు, బౌండరీలు... ఇలా అన్నింటిలోనూ కొత్త ఘనతలే. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో నేపాల్‌ ఏకంగా 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచిత్తుగా ఓడించింది.

ఈ క్రమంలో టి20ల్లో పలు రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్‌ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్‌; 8 ఫోర్లు, 12 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. రోహిత్‌ పౌడెల్‌ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), దీపేంద్ర సింగ్‌ ఐరీ (10 బంతుల్లో 52 నాటౌట్‌; 8 సిక్స్‌లు) అతనికి అండగా నిలిచారు.

అనంతరం మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. దవాసురెన్‌ (10) ఒక్కటే రెండంకెల స్కోరు చేయగా, ఎక్స్‌ట్రాలదే (23) అత్యధిక స్కోరు. మంగోలియా జట్టుకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ మాత్రమే కాదు, ఓవరాల్‌గా కూడా ఆ జట్టుకు ఇదే తొలి టి20 మ్యాచ్‌. తుది జట్టులోని 11 మందీ తొలిసారి టి20 మ్యాచ్‌ బరిలోకి దిగినవారే. దాంతో కాస్త అనుభవం ఉన్న నేపాల్‌ ముందు ఈ జట్టు కనీసం నిలవలేకపోయింది.  

మ్యాచ్‌లో నమోదైన రికార్డులు... 
314  అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఏ జట్టూ 300 పరుగులు చేయలేదు. 278 పరుగులతో ఉన్న రికార్డును (2019లో ఐర్లాండ్‌ జట్టుపై అఫ్గానిస్తాన్, 2019లో తుర్కియే జట్టుపై చెక్‌ రిపబ్లిక్‌) నేపాల్‌ బద్దలు కొట్టింది.  

273  టి20ల్లో అతి పెద్ద విజయం. గతంలో చెక్‌ రిపబ్లిక్‌ 257 పరుగులతో తుర్కియేని ఓడించింది.  

34 అంతర్జాతీయ టి20ల్లో కుశాల్‌ మల్లా 34 బంతుల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. గతంలో 35 బంతుల్లో రోహిత్‌ శర్మ (భారత్‌; 2017లో శ్రీలంకపై), డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా; 2017లో బంగ్లాదేశ్‌పై), విక్రమశేఖర (చెక్‌ రిపబ్లిక్‌; 2019లో తుర్కియేపై) నెలకొల్పిన సెంచరీ రికార్డు తెరమరుగైంది. 

అంతర్జాతీయ టి20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని దీపేంద్ర సింగ్‌ నమోదు చేశాడు. గతంలో 12 బంతులతో ఈ రికార్డు భారత స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ (2007లో ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. 

26  ఇన్నింగ్స్‌లో నేపాల్‌ అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు చేసింది. గతంలో అఫ్గానిస్తాన్‌ జట్టు ఐర్లాండ్‌పై (2019లో), వెస్టిండీస్‌ జట్టు దక్షిణాఫ్రికాపై (2023లో) 22 సిక్స్‌లు చొప్పున కొట్టింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement