ప్రపంచంలో భారత్‌, పాక్‌.. నం.1, 2.. ఇక ఒలింపిక్స్‌లో! నాకు తెలుసు.. | As Neeraj Chopra Bags Worlds Gold Pakistan Arshad Makes Big Olympics Prediction - Sakshi
Sakshi News home page

Neeraj Chopra: ప్రపంచంలో భారత్‌, పాక్‌.. నం.1, 2.. ఒలింపిక్స్‌లో మాత్రం: పాక్‌ జావెలిన్‌ త్రో స్టార్‌

Published Mon, Aug 28 2023 4:22 PM

As Neeraj Chopra Bags Worlds Gold Pak Arshad Makes Big Olympics Prediction - Sakshi

World Athletics Championships 2023- Neeraj Chopra- Arshad Nadeem: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2023లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘నీ ఆటకు నీరాజనం’ అంటూ భారతీయులంతా ఈ హర్యానా కుర్రాడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. నీరజ్‌కు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అతడి గెలుపును కొనియాడుతున్నారు.

ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌తో
కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి గెలిచి యావత్‌ భారతావనిని పులకింపజేసిన ఈ గోల్డెన్‌ బాయ్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌లోనూ గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా భారత అథ్లెట్లకు సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేసి రికార్డులకెక్కాడు.

నీరజ్‌ భాయ్‌.. సంతోషంగా ఉందన్న అర్షద్‌
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ జావెలిన్‌ త్రో స్టార్‌ అర్షద్‌ నదీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుడాపెస్ట్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్‌ కంటే ఒక అడుగు వెనుకబడి రజతంతో సరిపెట్టుకున్న అతడు.. ‘‘నీరజ్‌ భాయ్‌.. నీ విజయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది! ప్రపంచంలో ఇండియా- పాకిస్తాన్‌ 1, 2 స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచంలో భారత్‌, పాక్‌.. నం.1,2
ఆ దేవుడి దయ వల్ల ఒలింపిక్స్‌లోనూ మనం 1- 2 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని నీరజ్‌ చోప్రాకు ఈ సందర్భంగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఇక విజయానంతరం నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్‌ ముగిసిన తర్వాత నేను అర్షద్‌ను కలిశాను.

ప్రపంచ వేదికపై భారత్‌- పాక్‌ సత్తా చాటినందుకు ఇద్దరం సంతోషం పంచుకున్నాం. మాకు గట్టిపోటీనిచ్చిన యూరోపియన్‌ ఆటగాళ్లను దాటుకుని ముందుకు వెళ్లిన తీరును గుర్తు చేసుకున్నాం. క్రీడల్లో ఇరు దేశాల మధ్య ఉన్న పోటీతత్వం గురించి మాకు తెలుసు. 

అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసు
ఈసారి నేను గెలిచాను. దీంతో ఆసియా క్రీడల నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసు. మేము మళ్లీ చైనాలోని హాంగ్జూలో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ జాకూచ్‌ వాద్లెచ్‌(86.7 మీటర్లు)ను వెనక్కి నెట్టి వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో అర్షద్‌ రన్నరప్‌గా నిలిచాడు. 87.82 మీటర్ల దూరం ఈటెను విసిరి రజత పతకం గెలిచాడు.

చదవండి: నవీన్‌కు గట్టి షాక్‌.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌! అయ్యో పాపం..
ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. విధ్వంసకర ఆటగాడు దూరం! 

Advertisement
Advertisement