Sakshi News home page

Who Won The Hundred League 2023: చితక్కొట్టిన కర్రన్‌.. హండ్రెడ్‌ లీగ్‌ 2023 విజేతగా ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌

Published Mon, Aug 28 2023 5:08 PM

Oval Invincibles And Southern Brave Are The Hundred League 2023 Champions - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. పురుషుల విభాగంలో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌, మహిళల విభాగంలో సథరన్‌ బ్రేవ్‌ ఛాంపియన్స్‌గా అవతరించాయి. నిన్న (ఆగస్ట్‌ 27) జరిగిన పురుషుల ఫైనల్స్‌లో ఇన్విన్సిబుల్స్‌.. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ను, మహిళల ఫైనల్స్‌లో సథరన్‌ బ్రేవ్‌.. నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ను ఓడించి, టైటిల్స్‌ చేజిక్కించుకున్నాయి. హండ్రెడ్‌ లీగ్‌లో ఇరు జట్లకు ఇదే తొలి టైటిల్‌ కావడం విశేషం. 

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన టామ్‌ కర్రన్‌..
మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన ఫైనల్స్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ 14 పరుగుల తేడాతో గెలుపొంది, హండ్రెడ్‌ లీగ్‌ పురుషుల విభాగపు విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఓవల్‌.. జిమ్మీ నీషమ్‌ (33 బంతుల్లో 57 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌), టామ్‌ కర్రన్‌ (34 బంతుల్లో 67 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 161 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మాంచెస్టర్‌ బౌలర్లలో రిచర్డ్‌ గ్లీసన్‌ 2, జాషువ లిటిల్‌, పాల్‌ వాల్టర్‌, టామ్‌ హార్ట్లీ తలో వికెట్‌ పడగొట్టారు. 

బంతిలోనూ రాణించిన కర్రన్‌.. చేతులెత్తేసిన మాంచెస్టర్‌
162 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మాంచెస్టర్‌ ఆటగాళ్లు ఆది నుంచే తడబడుతూ వచ్చి ఓటమిని కొనితెచ్చుకున్నారు. ఓవల్‌ బౌలర్లు విల్‌ జాక్స్‌ (2/11), టామ్‌ కర్రన్‌ (1/25), డానీ  బ్రిగ్స్‌ (1/2), నాథన్‌ సౌటర్‌ (1/24), సామ్‌ కర్రన్‌ (1/31) మాంచెస్టర్‌ ఆటగాళ్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఫలితంగా మాంచెస్టర్‌ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. మాంచెస్టర్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ మాడ్‌సన్‌ (37), జేమీ ఓవర్టన్‌ (28 నాటౌట్‌), ఫిలిప్‌ సాల్ట్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

ఛాంపియన్‌గా సథరన్‌ బ్రేవ్‌..
హండ్రెడ్‌ లీగ్‌ మహిళల విభాగపు ఛాంపియన్‌గా సథరన్‌ బ్రేవ్‌ అవతరించింది. ఫైనల్లో బ్రేవ్‌.. నార్త్ర్‌న్‌ సూపర్‌ ఛార్జర్స్‌ను 34 పరుగుల తేడాతో చిత్తు చేసి, రెండు ప్రయత్నాల తర్వాత తొలి హండ్రెడ్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్‌.. డేనియల్‌ వ్యాట్‌ (59), ఫ్రేయా కెంప్‌ (31), ఆడమ్స్‌ (27) రాణించడంతో నిర్ణీత బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లలో కేట్‌ క్రాస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్‌ బల్లింజర్‌, లూసీ హిగమ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

చెలరేగిన లారెన్‌ బెల్‌, మూర్‌..
140 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకునే క్రమంలో బ్రేవ్‌ బౌలర్లు చెలరేగిపోయారు. లారెన్‌ బెల్‌ (3/21), కేలియా మూర్‌ (3/15), ట్రయాన్‌ (2/28), అన్య ష్రబ్‌సోల్‌ (1/18) అద్భుతంగా బౌలింగ్‌ చేసి, సూపర్‌ ఛార్జర్స్‌ను 105 పరుగులకు కుప్పకూల్చారు. బ్రేవ్‌ బౌలర్లు విజృంభించడంతో సూపర్‌ ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌ మరో 6 బంతులు మిగిలుండగానే ముగిసింది. సూపర్‌ ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెస్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement