క్వార్టర్‌ ఫైనల్లో సింధుకు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సింధుకు చుక్కెదురు

Published Sat, Oct 23 2021 5:36 AM

P V Sindhu loses in quarterfinals in Denmark Open - Sakshi

ఒడెన్స్‌: టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 36 నిమిషాల్లో 11–21, 12–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ ఆన్‌ సెయంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది.

ఆన్‌ సెయంగ్‌తో పోరులో సింధు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలుత సింధు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఆన్‌ సెయంగ్‌ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఆన్‌ సెయంగ్‌ వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్‌లోనూ ఆన్‌ సెయంగ్‌ జోరు కొనసాగింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరు స్కోర్లు సమం కాకపోవడం ఆన్‌ సెయంగ్‌ ఆధిపత్యానికి నిదర్శనం. మరోవైపు టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ తొలి గేమ్‌ను 17–21తో చేజార్చుకున్నాక గాయంతో మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.   

Advertisement
Advertisement