PAK Vs AUS: డబుల్‌ చేజార్చుకున్న అజహర్‌ అలీ.. పాక్‌ భారీ స్కోర్‌

5 Mar, 2022 19:12 IST|Sakshi

రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆతిధ్య పాకిస్థాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి (షఫీఖ్‌ (44)) 245 పరుగులు చేసిన బాబర్‌ సేన.. రెండో రోజు కూడా దూకుడు కొనసాగించి 476/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి రోజు సెంచరీ హీరో ఇమామ్‌ ఉల్‌ హక్‌ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓవర్‌నైట్‌ స్కోర్‌కు 25 పరుగులు జోడించి ఔట్‌ కాగా, వన్‌డౌన్‌ ఆటగాడు అజహర్‌ అలీ (185) రెండో రోజు భారీ శతకాన్ని బాదాడు. 

కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ (36) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ కాగా, ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే సమయానికి మహ్మద్‌ రిజ్వాన్‌ (29), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లియాన్‌, కమిన్స్‌, లబూషేన్‌ తలో వికెట్‌ పడగొట్టగా, బాబర్‌ రనౌటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 5 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్‌ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు.
చదవండి: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు