Pak Vs Eng 1st Test: Three Pakistan Batters Hits Hundreds vs England - Sakshi
Sakshi News home page

Pak Vs Eng 1st Test: ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్‌.. వాళ్లు 4 శతకాలు బాదితే, వీళ్లు 3 కొట్టారు

Published Sat, Dec 3 2022 3:47 PM

Pak Vs Eng 1st Test: Three Pak Batters Hits Hundreds - Sakshi

రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్తాన్‌.. ప్రత్యర్ధికి ధీటుగా బదులిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నలుగురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌.. తామేమీ తక్కువ కాదు అన్నట్లు రెచ్చిపోయి ఆడుతుంది.

ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (126 బంతుల్లో 106 నాటౌట్‌; 14 ఫోర్లు, సిక్స్‌) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్‌ టాప్‌-4లో ముగ్గురు బ్యాటర్లు శతకొట్టారు.

ఫలితంగా ఆట మూడో రోజు టీ విరామం సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ సహా సౌద్‌ షకీల్‌ (35) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పాక్‌.. ఇం‍గ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 246 పరుగులు వెనుకపడి ఉంది. నిర్జీవమైన ఈ పిచ్‌పై పాక్‌ సైతం భారీ స్కోర్‌ చేసే అవకాశం ఉండటంతో మ్యాచ్‌ డ్రాగా ముగియడం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే పలు ప్రపంచ రికార్డులు బద్దలైన విషయం తెలిసిందే. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్‌ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇం‍గ్లండ్‌ టీమ్‌ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.

వీటన్నిటికీ మిం‍చి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్‌ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీలతో విరుచుకుపడ్డారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement