Pakistan Super League Franchise Multan Sultans Owner Dies By Suicide - Sakshi
Sakshi News home page

Alamgir Khan Tareen: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ముల్తాన్‌ సుల్తాన్స్‌ యజమాని ఆత్మహత్య!

Published Thu, Jul 6 2023 5:52 PM

Pakistan Super League Franchise Multan Sultans Owner Dies By Suicide - Sakshi

Alamgir Tareen, Owner Of Pakistan Super League Franchise: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ జట్టు ముల్తాన్‌ సుల్తాన్స్‌ శిబిరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఫ్రాంఛైజీ యజమాని ఆలంగిర్‌ తరీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లాహోర్‌లోని గుల్బర్గ్‌లో గల తన నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాగా ముల్తాన్‌ సుల్తాన్స్‌ సీఈఓ హైదర్‌ అజర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆలంగిర్‌ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించాడు. ‘‘మా జట్టులో అత్యంత కీలకమైన, గౌరవనీయులైన వ్యక్తి ఆలంగిర్‌ తరీన్‌ హఠాన్మరణం చెందారు.

ఈ కష్టకాలంలో ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మనమంతా ప్రార్థిద్దాం’’ అని హైదర్‌ ప్రకటన విడుదల చేశాడు. ఇక ముల్తాన్‌ సుల్తాన్స్‌ సైతం ట్విటర్‌ వేదికగా స్పందించింది.

ప్రైవసీకి భంగం కలిగించకండి
‘‘మా ప్రియమైన యజమాని ఆలంగిర్‌ ఖాన్‌ తరీన్‌ ఇక లేరన్న విషాదకర వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. దయచేసి ఎవరూ కూడా తరీన్‌ కుటుంబ గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని ఈ సందర్భంగా విజ్జప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని విచారం వ్యక్తం చేసింది.

ఇక పీఎస్‌ఎల్‌లోని ఇతర ఫ్రాంఛైజీ లాహోర్‌ ఖలందర్స్‌ కూడా ఆలంగిర్‌ మృతి పట్ల సంతాపం తెలిపింది. కాగా 2021లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. తాజా సీజన్‌లో ఈ జట్టుకు మహ్మద్‌ రిజ్వాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. ఆలంగిర్‌ ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. 

ఉన్నత విద్యావంతుడు
ఆలంగిర్‌ తరీన్‌(63) ప్రఖ్యాత యేల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. దక్షిణ పంజాబ్‌లో మేటి వ్యాపారవేత్తగా ఎదిగిన అతడికి క్రీడల పట్ల ఆసక్తి మెండు. పాకిస్తాన్‌లోనే అత్యంత పెద్దదైన నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్న ఆలంగిర్‌.. పీఎస్‌ఎల్‌లో భాగమయ్యే క్రమంలో ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్టును కొనుగోలు చేశాడు. ఆ జట్టు ఇప్పటి వరకు ఒకే ఒకసారి ట్రోఫీ గెలిచింది.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌ ఎవరో తెలుసా?
'టీమిండియాతో మ్యాచ్‌ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒ‍క్క గేమ్‌ మాత్రమే'

Advertisement
Advertisement