Asia Cup: మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు లంక! పాక్‌ సంగతి అంతే ఇక.. | Asia Cup 2023 Pak Vs SL: Pakistan Will Play Against Sri Lanka Today, Know Time, When And Where To Watch - Sakshi
Sakshi News home page

Asia Cup 2023 Pak Vs SL: మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు లంక! పాక్‌ సంగతి అంతే ఇక..

Published Thu, Sep 14 2023 1:48 AM

Pakistan will play against Sri Lanka in the Asia Cup today - Sakshi

కొలంబో: ఆసియా కప్‌లో ‘సెమీఫైనల్‌’లాంటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్‌–4 దశలో భాగంగా నేడు జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్తాన్‌ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించగా... భారత్‌తో తుది పోరులో తలపడే ప్రత్యర్థిని ఈ మ్యాచ్‌ నిర్ణయించనుంది. నాలుగో జట్టయిన బంగ్లాదేశ్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడి ఫైనల్‌ రేసు నుంచి తప్పుకుంది.

ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి అడుగు పెడుతుంది. భారత్‌ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు రన్‌రేట్‌లో పాక్‌ భారీగా వెనుకబడగా... టీమిండియా చేతిలో ఓడినా చివరి వరకు పోరాడిన లంక మెరుగైన స్థితిలో ఉంది. వర్షం కారణంగా నేటి మ్యాచ్‌ రద్దయితే లంక లాభపడుతుంది. మెరుగైన రన్‌రేట్‌తో ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది.  

బలాబలాల దృష్ట్యా చూస్తే పాకిస్తాన్, శ్రీలంక సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే సొంతగడ్డపై లంకకు అదనపు ప్రయోజనం ఉంది. భారత్‌తో పోరులో పాక్‌ పేలవ బ్యాటింగ్‌ బయటపడింది. ఓపెనర్లు ఫఖర్‌ జమాన్, ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ అంతంత మాత్రమే ఆడుతుండగా, వరల్డ్‌ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగిన బాబర్‌ ఆజమ్‌ దానికి తగినట్లుగా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. మిడిలార్డర్‌లో రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్‌ కూడా జట్టు ఆశించిన రీతిలో స్కోర్లు చేయలేకపోతున్నారు.

అయితే అన్నింటికంటే మించి ప్రధాన బౌలర్లు హారిస్‌ రవూఫ్, నసీమ్‌ షా ఈ మ్యాచ్‌కు దూరం కావడం పాక్‌కు పెద్ద దెబ్బ. నసీమ్‌ అధికారికంగా తప్పుకోగా అతని స్థానంలో జమాన్‌ను ఎంపిక చేశారు. రవూఫ్‌ కూడా ఆడే తక్కువగా ఉండటంతో దమాని బరిలోకి దిగవచ్చు. పాక్‌ స్పిన్‌ కూడా బలహీనంగా ఉంది. మరోవైపు లంక స్పిన్‌ బలమేంటో గత మ్యాచ్‌లో కనిపించింది.

ఇదే జోరు కొనసాగిస్తే పాక్‌ను ఆ జట్టు సునాయాసంగా అడ్డుకోగలదు. వెలలాగె, అసలంక, తీక్షణలను పాక్‌ ఎలా ఆడుతున్నది చూడాలి. ప్రధానంగా కుశాల్‌ మెండిస్, నిసాంక, సమరవిక్రమ, ధనంజయలపై ఆ జట్టు బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్‌గా కెపె్టన్‌ షనక కీలక ప్రదర్శన చేయాల్సి ఉంది.  

155  ఇప్పటి వరకు శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు 155 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 92 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, 58 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement