ప్రేయసిని హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఆసీస్‌ క్రికెటర్‌..

31 May, 2021 19:15 IST|Sakshi

కాన్‌బెర్రా: రెండు నెలల విరామం అనంతరం కడుపుతో ఉన్న ప్రేయసిని కలుసుకున్న ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు పాట్‌ కమిన్స్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. సిడ్నీలో 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను ముగించుకుని సోమవారం స్వస్థలానికి చేరుకున్న కమిన్స్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో ప్రేయసి బెక్కీ బోస్టన్‌ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనై ఆనంద బాష్పాలు కార్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట 'వీడియో ఆఫ్‌ ద డే'గా ట్రెండ్‌ అవుతూ తెగ హల్‌చల్‌ చేస్తుంది. కాగా, కోవిడ్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 వాయిదా పడటంతో లీగ్‌లో పాల్గొన్న ఆసీస్‌ ఆటగాళ్లంతా రెండు వారాలు మాల్దీవుల్లో గడిపి అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆతరువాత వీరు సిడ్నీలో 14 రోజులు కఠిన క్వారంటైన్‌లో గడిపారు. 

ఇదిలా ఉంటే, కమిన్స్‌.. కడుపుతో ఉన్న ప్రేయసితో సమయాన్ని  గడిపేందుకు ఐపీఎల్‌ సెకండాఫ్‌ మ్యాచ్‌లతో పాటు వెస్టిండీస్‌ పర్యటన కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు సందేశాన్ని కూడా పంపాడు. కమిన్స్‌ బాటలోనే ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉన్న కారణంగా.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబంతో గడిపాలని ఈ క్రికెటర్లు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు మరి కొంత మంది ఆసీస్‌ ఆటగాళ్లు కూడా విండీస్‌ పర్యటనతో పాటు ఐపీఎల్‌కు డుమ్మా కొట్టే ఉద్ధేశంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.  
చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్‌ నుంచి స్టార్‌ ఆటగాడు ఔట్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు