పరువు పోతుంది; పాక్‌ క్రికెటర్లకు వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆటగాళ్లకు ‘కివీస్‌’ ఫైనల్‌ వార్నింగ్‌..!

Published Fri, Nov 27 2020 12:09 PM

PCB CEO Says If 1 More Breach Players Will Send Back Form New Zealand - Sakshi

ఇస్లామాబాద్‌/వెల్లింగ్‌టన్‌: ‘‘బాయ్స్‌.. నేను న్యూజిలాండ్‌ ప్రభుత్వంతో మాట్లాడాను. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాము కఠిన వైఖరిని అవలంబిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే మీరు మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘించారు. మనకు మరొక్క అవకాశం మాత్రమే ఉంది. ఇంకోసారి రూల్స్‌ అతిక్రమిస్తే వారు మనల్ని ఇంటికి పంపించేస్తారు. ఇది మనదేశ ప్రతిష్టతో ముడిపడిన అంశం. ఈ విషయంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఇప్పటికే మనకు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది కష్టకాలమని తెలుసు. కానీ కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా దేశం నుంచి పంపిచేస్తారు. క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటారు. 

ఇది పాకిస్తాన్‌ పరువుకు సంబంధించిన అంశం. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా. ఇదే ఆఖరి వార్నింగ్‌’’ అని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సీఈఓ వసీంఖాన్‌ తమ జట్టు ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని, ఈ విషయంలో కివీస్‌ ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి కూడా అవకాశం లేదని స్పష్టం చేశాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా పాక్‌ క్రికెట్‌ జట్టు ఈనెల 24న అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: టీమిండియాతో తొలి వన్డే: ఓపెనర్‌ వార్నర్‌ ఔట్‌)

ఈ క్రమంలో వారికి కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌(ఎన్‌జెడ్‌సీ) గురువారం వెల్లడించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఐసోలేషన్‌లో భాగంగా పాక్‌ జట్టు ఆటగాళ్లలో కొంతమంది నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం. దీంతో అసహనానికి లోనైన ప్రభుత్వం.. తమ టూరిస్టులకు రూల్స్‌ గురించి సవివరంగా తెలియజేస్తామని, వారు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఉన్నట్లు మరో ప్రకటన విడుదల చేసింది. 

ఇక ఈ విషయంపై స్పందించి పీసీబీ సీఈఓ వసీంఖాన్‌..‘‘ క్వారంటైన్‌లో ఉండటం కాస్త కష్టంతో కూడుకున్న పనే. మేం అర్థం చేసుకోగలం. అయితే ఇది పాక్‌ గౌరవానికి సంబంధించిన విషయం. 14 రోజులు ఓపిక పడితే, ఆ తర్వాత రెస్టారెంట్లకు వెళ్లడం సహా స్వేచ్ఛగా విహరించే అవకాశం దక్కుతుంది. ఇంకొక్కసారి రూల్స్‌ బ్రేక్‌ చేస్తే మనల్ని ఇంటికి పంపేస్తామని స్పష్టం చేశారు. దయచేసి అర్థం చేసుకోండి’’ అని పాక్‌ క్రికెటర్లకు విజ్ఞప్తి చేశాడు. కాగా న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ సిరీస్‌ డిసెంబర్ ‌10 నుంచి మొదలు కానుంది. డిసెంబర్‌ 18న తొలి టీ20, 26 నుంచి జనవరి 7 వరకూ రెండు టెస్టుల సిరీస్‌ జరుగుతుంది.

Advertisement
Advertisement