Pitches For Team India ODI World Cup 2023, Five Different Tracks For 5 Teams Matches - Sakshi
Sakshi News home page

#ICCWorldCup2023: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు..

Published Wed, Jun 28 2023 12:29 PM

Pitches For India ODI-World-Cup Games Five-Different Tracks-For-5-Teams - Sakshi

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023 మెగా సమరానికి మరో 99 రోజుల కౌంట్‌డౌన్‌ మిగిలి ఉంది. నాలుగోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా పెవరెట్‌గా కనిపిస్తోంది. పుష్కరకాలం కిందట ధోని సేన స్వదేశంలో ప్రపంచకప్‌ను కొట్టి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తాజాగా మరోసారి వరల్డ్‌కప్‌కు మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో రోహిత్‌ సేన ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక మంగళవారం ఐసీసీ.. వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనున్న మెగా సమరంలో 48 లీగ్‌ మ్యాచ్‌లు సహా రెండు సెమీఫైనల్స్‌, ఒక ఫైనల్‌ జరగనుంది. మొదటి సెమీఫైనల్‌కు ముంబై.. రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్‌కు అహ్మదాబాద్‌ వేదిక కానుంది.

ఇక టీమిండియా తొమ్మిది వేదికల్లో(హైదరాబాద్‌ మినహా) వివిధ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆడేందుకు దేశం మొత్తం మీద ప్రధాన నగరాల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు(9700 కిమీ) ప్రయాణం చేయనుంది. ఇందులో చిన్నజట్లతో మ్యాచ్‌లు మినహాయిస్తే భారత్‌ ఎదుర్కొనే ఐదు ప్రధాన ప్రత్యర్థులు, ఎక్కడ మ్యాచ్‌ ఆడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐదు ప్రధాన జట్లతో ఆడబోతున్న మ్యాచ్‌ల్లో పిచ్‌లు టీమిండియాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో జట్టుకు ఒక్కో పిచ్‌ను రూపొందించనుండడం విశేషం.

ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా(అక్టోబర్‌ 8, చెన్నై వేదికగా)
ఈ మెగా సమరంలో టీమిండియా ఆడబోయే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరగనుంది. అప్పటికి చలికాలం సీజన్‌ ప్రారంభం అవుతుంది. రెండో బ్యాటింగ్‌ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చాన్స్‌ ఉండడంతో ఇక్కడ ఏ జట్టైనా తొలి బ్యాటింగ్‌ చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీన్నిబట్టి చెన్నై పిచ్‌ కాస్త స్లగిష్‌గా ఉండే అవకాశముంది.

ఇక 1987 నుంచి టీమిండియా చిదంబరం స్టేడియంలో 14 మ్యాచ్‌లాడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో నాలుగు విజయాలు ఈ దశాబ్దంలో వచ్చినవే. గతేడాది ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఇక స్టేడియంలో పలు మార్పులు చేస్తున్నారు. స్టేడియం ఫ్లడ్‌లైట్స్‌ను ఎల్‌ఈడీ వెలుగులతో నింపుతున్నారు. ఇక మ్యాచ్‌కు రెండు ఎర్రమట్టి పిచ్‌లను తయారు చేస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నాయి

ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌(అక్టోబర్‌ 15, అహ్మదాబాద్‌)
వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క మ్యాచ్‌ మరొక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌లు అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా తలపడనున్నాయి. లక్షా 30వేల మంది కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో భారత్, పాక్‌ జరిగే రోజున స్టేడియం సామర్థ్యానికి మించి జనం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇరుదేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ఇక పిచ్‌ను ప్లాట్‌గా రూపొందిచే ప్రక్రియలో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్‌లో పరుగుల వర్షం రావాలని.. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్రమోదీ స్టేడియం స్పిన్నర్లకు అనువుగా ఉంటుంది. అయితే ఈసారి ఎర్రమట్టి బదులు నల్లమట్టిని పిచ్‌కు వాడనున్నారు. దీంతో కాస్త లోబౌన్స్‌ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువమేరకు ప్లాట్‌గానే రూపొందించనున్నారు. అంటే చిరకాల ప్రత్యర్థుల పోరులో పరుగుల సునామీని చూసే అవకాశం ఉంటుంది. 1984 నుంచి టీమిండియా ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడితే 10 విజయాలు సాధించింది. 2021లో ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు మార్చారు.

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌(అక్టోబర్‌ 22, ధర్మశాల)
దేశంలో అతిచిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటిగా ఉంది. ఇక్కడి బౌండరీ లైన్‌ చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక్కడి పిచ్‌ పేసర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌కు నల్లమట్టిని ఉపయోగించి పిచ్‌ను రూపొందించనున్నారు. బ్యాటింగ్‌ ట్రాక్‌కు అనుకూలమైనప్పటికి మ్యాచ్‌ రోజు ఎండ ఉంటే పరుగులు బాగానే వస్తాయి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం రెండో బ్యాటింగ్‌ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. అందుకే టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌  ఎంచుకోవడం ఉత్తమం. మన దేశంలో కొత్త స్టేడియాల్లో ఒకటిగా ఉన్న ధర్మశాలలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే రెండు గెలిచి.. రెండింట ఓడింది.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌(అక్టోబర్‌ 29, లక్నో)
ఐపీఎల్‌ సమయంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో పెద్దగా పరుగుల వరద పారింది లేదు. ఇక్కడి పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్పిన్‌ ట్రాక్‌నే కంటిన్యూ చేయనున్నారు. ఇక్కడ టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌లో ప్రొటీస్‌ ఓడిపోయింది. ఇక్కడి పిచ్‌ ప్రభావం కారణంగా జట్లు స్కోర్లు 250 నుంచి 270 మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిచ్‌పై నల్లమట్టిని ఉపయోగించనున్నారు. ఎక్కువగా స్పిన్నర్లు ప్రభావం చూపించే మ్యాచ్‌లో పేసర్లకు అనువైన బౌలింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. 

ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా(నవంబర్‌ 5, కోల్‌కతా)
అహ్మదాబాద్‌ తర్వాత కెపాసిటీలో, స్టేడియం సామర్థ్యంలో రెండో అతిపెద్ద స్టేడియం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మెగాటోర్నీలు ఎప్పుడు జరిగినా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. పైగా ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమిండియాకు సూపర్‌ రికార్డు ఉంది. ఆడిన 22 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు గెలిచింది. 2011 నుంచి 2017 వరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందితే.. రెండో బ్యాటింగ్‌ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై అటు పేసర్లకు.. ఇటు స్పిన్నర్లకు సమానపాత్ర ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. 

చదవండి: వన్డే వరల్డ్‌కప్‌-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..?

ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం

Advertisement

తప్పక చదవండి

Advertisement