BCCI Chief Selector Ajit Agarkar Drops Biggest Hint Over Yuzvendra Chahal World Cup 2023 Chances - Sakshi
Sakshi News home page

Asia Cup: అందుకే చహల్‌పై వేటు.. ఇకపై.. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ కీలక వ్యాఖ్యలు

Published Mon, Aug 21 2023 4:12 PM

At This Point Kuldeep Little Bit Ahead: Agarkar Big Hint Over Chahal WC Chances - Sakshi

India Asia Cup 2023 squad: ‘‘టీమిండియా తరఫున అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. టెర్రిఫిక్‌ పర్ఫార్మర్‌. కానీ.. కొన్నిసార్లు సమతూకమైన జట్టును ఎంపిక చేసే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లలో అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు.

తను బ్యాటింగ్‌ కూడా చేయగలడు. ఇక కుల్దీప్‌ యాదవ్‌ ప్రదర్శన కూడా చాలా బాగుంది. నిజానికి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. 15 మందితో కూడిన జట్టు అయితే, ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరిని తప్పించాల్సి వచ్చేది.

దురదృష్టవశాత్తూ చహల్‌ డ్రాప్‌!
లక్కీగా 17 మందికి చోటు ఉంది కాబట్టి.. సరిపోయింది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ అతడిని వదులుకోవాల్సి వచ్చింది. నిజానికి ప్రస్తుతం.. తన కంటే కుల్దీప్‌ ఓ అడుగు ముందే ఉన్నాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో మాకు మెరుగైన ఆప్షన్‌ అనిపించాడు. అందుకే చహల్‌ మిస్‌ అయ్యాడు’’ అని బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు.

ఆసియా కప్‌-2023 వన్డే టోర్నీ నేపథ్యంలో.. బీసీసీఐ జట్టును ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో రిస్ట్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై మాత్రం మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది.

అందుకే చహల్‌పై వేటు!
జట్టు ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చహల్‌ గురించి ప్రశ్న ఎదురుకాగా అజిత్‌ అగార్కర్‌ పైవిధంగా స్పందించాడు. ఇద్దరు రిస్ట్‌ స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్లే చహల్‌ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

కాగా ఆసియాకప్‌ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్‌ ఆరంభం కానుంది. అంతకంటే ముందు అంటే.. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్‌ ఆడనుంది. 

మరి వరల్డ్‌కప్‌లో..?
ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు ఆసియా కప్‌ జట్టును ప్రొవిజినల్‌ టీమ్‌గా పరిగణిస్తున్న తరుణంలో చహల్‌పై వేటు పడటం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అజిత్‌ అగార్కర్‌ కుల్దీప్‌నకు మద్దతుగా నిలవగా.. రోహిత్‌ శర్మ మాత్రం చోటు లేదు కాబట్టే అతడిని జట్టులోకి తీసుకోలేదన్నాడు. వరల్డ్‌కప్‌లో చహల్‌కు దారులు మూసుకుపోలేదని స్పష్టం చేయడం గమనార్హం.

కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యుజీ చహల్‌ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ గత రెండు సీజన్లుగా రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున అదరగొడుతున్నాడు.

చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్‌ శర్మ గుడ్‌న్యూస్‌.. 
Asia Cup: అయ్యర్‌, రాహుల్‌ వచ్చేశారు.. తిలక్‌ వర్మ ఇన్‌.. పాపం సంజూ!

Advertisement
Advertisement