SL VS IRE 1st Test: Prabath Jayasuriya Rips Ireland With 5 Wicket Haul, 5th In 6 Matches - Sakshi
Sakshi News home page

SL VS IRE 1st Test: 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు.. దుమ్మురేపుతున్న లంక స్పిన్నర్‌

Published Mon, Apr 17 2023 6:44 PM

Prabath Jayasuriya Rips Ireland With 5 Wicket Haul, 5th In 6 Matches - Sakshi

గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య ఐదు వికెట్ల ఘనత (19-9-42-5)తో చెలరేగాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. జయసూర్యకు జతగా విశ్వ ఫెర్నాండో 2 వికెట్లతో రాణించాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జేమ్స్‌ మెక్‌కొల్లమ్‌ (35), హ్యారీ టెక్టార్‌ (34), పీటర్‌ మూర్‌ (14), లోర్కాన్‌ టకెర్‌ (21 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు సాధించగా.. ముర్రే కొమిన్స్‌ (0), ఆండ్రూ బల్బిర్నీ (4), కర్టిస్‌ క్యాంఫర్‌ (0), జార్జ్‌ డాక్రెల్‌ (2) విఫలమయ్యారు.

అంతకుముందు దిముత్‌ కరుణరత్నే (179), కుశాల్‌ మెండిస్‌ (140), దినేశ్‌ చండీమాల్‌ (102 నాటౌట్‌), సమరవిక్రమ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో  శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 591 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు..
2 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి పతనాన్ని శాశించిన జయసూర్య దిగ్గజ బౌలర్ల సరసన చేరాడు. జయసూర్య కేవలం 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు, ఓ సారి 10 వికెట్లు పడగొట్టి ఓవరాల్‌గా 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 5 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత ఆస్ట్రేలియా బౌలర్‌ రాడ్నీ హాగ్‌ పేరిట నమోదై ఉంది.

ఇతను కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. టీమిండియా సంచలన ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సైతం 3 మ్యాచ్‌ల్లోనే 4 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన టామ్‌ రిచర్డ్‌సన్‌ 4 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. ఆసీస్‌కు చెందిన చార్లీ టర్నర్‌ 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి నేటికి చెక్కుచెదరని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.  


 

Advertisement
Advertisement