R Ashwin Finally Breaks Silence On Being Dropped From WTC 2023 Final Playing XI - Sakshi
Sakshi News home page

#RAshwin: బాధ కలిగిన మాట నిజమే..

Published Tue, Jun 13 2023 12:15 PM

R Ashwin Finally Breaks Silence-Being Dropped-WTC 2023 Final Playing XI - Sakshi

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్‌ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను అదనపు పేసర్‌గా తీసుకొచ్చారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్‌ ముగిసేవరకు అశ్విన్‌ స్పందించలేదు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన అనంతరం అశ్విన్‌ ఎట్టకేలకు నోరు విప్పాడు.

ట్విటర్‌ ద్వారా స్పందించిన అశ్విన్‌ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ''డబ్ల్యూటీసీ టైటిల్‌ సాధించిన పాట్‌ కమిన్స్‌ సేనకు కంగ్రాట్స్‌. ఈ విజయానికి వారు అర్హులు. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు. ఎంత కష్టపడినా జట్టులో 11 మందికి మాత్రమే చోటు ఉంటుంది. వికెట్‌ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్‌ చాలనుకొని జడేజాను ఆడించారు. అయితే టీమిండియా ఓటమి బాధ కలిగించింది నిజమే.  

మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన పోరాటం బాగుంది. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ వరకు వచ్చాం. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం బాధనే కలిగిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడిన సభ్యులకు.. ముఖ్యంగా కోచింగ్‌, సపోర్ట్‌ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందుకు వస్తా'' అంటూ తెలిపాడు.

ఇక డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో టీమిండియా తరపున అశ్విన్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ సైకిల్‌లో అశ్విన్‌ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు(తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు) పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్‌ ఫైనల్‌ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు.

చదవండి: అహ్మదాబాద్‌ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత?

Advertisement

తప్పక చదవండి

Advertisement