రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. చెత్తగా ఆడతాడు! | Sakshi
Sakshi News home page

రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట?

Published Wed, Apr 3 2024 10:43 AM

Receiving Salary From Time To Time But: Manoj Tiwari on Maxwell Flop Show - Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని.. కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మాక్సీ నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(20), ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌(24) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాపార్డర్‌ విఫలం కాగా.. బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మాక్సీ చేతులెత్తేశాడు.

లక్నో యువ పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహిపాల్‌ లామ్రోర్‌(13 బంతుల్లో 33) కాసేపు పోరాడినా ఆర్సీబీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనోజ్‌ తివారి క్రిక్‌బజ్‌ షోలో మాక్స్‌వెల్‌ గురించి మాట్లాడాడు.

ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు
‘‘ఆర్సీబీ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను రిటైన్‌ చేసుకుంది. సరైన సమయానికి జీతం తీసుకుంటాడు. కానీ అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు అన్నట్లుగా ఉంది అతడి పరిస్థితి. ఆటగాడిగా అతడికి అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? ఐపీఎల్‌లో అతడి ట్రాక్‌ రికార్డు చూసినట్లయితే,, పంజాబ్‌ ఫ్రాంఛైజీకి ఆడినపుడు కూడా ఇలాగే ఉండేవాడు.

మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడు. అతడి ఆటలో నిలకడలేదు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిది’’ అని మాజీ బ్యాటర్‌ మనోజ్‌ తివారి అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌-2024 కోసం ఆర్సీబీ రూ. 11 కోట్లకు మాక్సీని రిటైన్‌ చేసుకుంది. ఆర్సీబీ తరఫున గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 400 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

అతడికి ఏకంగా 17 కోట్లు
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ నుంచి భారీ ధర(రూ. 17.5 కోట్లు)కు ట్రేడ్‌ చేసుకున్న కామెరాన్‌ గ్రీన్‌ కూడా ఆర్సీబీకి పెద్దగా ఉపయోగపడటం లేదని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు. ఏదేమైనా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ జట్టుతో లేనిలోటు ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తోందన్నాడు.

ఆర్సీబీ వర్సెస్‌ లక్నో స్కోర్లు:
టాస్‌: ఆర్సీబీ.. బౌలింగ్‌
లక్నో స్కోరు:  181/5 (20)
ఆర్సీబీ స్కోరు: 153 (19.4)
ఫలితం: 28 పరుగుల తేడాతో ఆర్సీబీపై లక్నో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మయాంక్‌ యాదవ్‌(లక్నో- 3/14).

చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే!

Advertisement

తప్పక చదవండి

Advertisement