IPL 2023, GT Vs KKR Highlights: Rinku Singh Pulls Off Miracle As KKR And GT Winning Streak - Sakshi
Sakshi News home page

రింకూ 6,6,6,6,6

Published Sun, Apr 9 2023 8:04 PM

Rinku Singh Super Innings Witness-Most Dramatic Finish-Ever IPL History - Sakshi

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు..  ఏకంగా ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్స్‌లు... ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఆఖరి ఓవర్లో సృష్టించిన విధ్వంసమిది. రింకూ అత్యద్భుత ఆటతీరుతో ఓటమి తథ్యమనుకున్న చోట కోల్‌కతా విజయకేతనం  ఎగురవేసింది. గెలుపు ఖాయమనుకున్న గుజరాత్‌ టైటాన్స్‌కు రింకూ ఆటతో దిమ్మదిరిగిపోయింది. ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో అభిమానులు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు చూశారు. ఆఖరి బంతికి ఫలితాలు తారుమారైన మ్యాచ్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ రింకూ సింగ్‌ ఆడిన  ఇన్నింగ్స్‌ మాత్రం అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు.   

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ టోర్నీ లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. డిఫెండింగ్‌  చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మూడు వికెట్లతో అసాధారణ విజయం సాధించింది. 205 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్‌కతా సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి ముంగిట ఉన్న కోల్‌కతాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రింకూ  సింగ్‌ (21 బంతుల్లో 48 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) విజయతీరానికి చేర్చాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18 ఓవర్లు ముగిసేసరికి 162/7తో  ఉంది. గెలవాలంటే కోల్‌కతా 12  బంతుల్లో 43 పరుగులు చేయాలి. 19వ ఓవర్లో కోల్‌కతా14 పరుగులు సాధించింది. దాంతో ఆ జట్టు విజయ సమీకరణం 6 బంతుల్లో 29 పరుగులుగా మారింది. గుజరాత్‌ బౌలర్‌ యశ్‌ దయాళ్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి ఉమేశ్‌ సింగిల్‌ తీసి రింకూ సింగ్‌కు స్ట్రయిక్‌ ఇచ్చాడు. కోల్‌కతా నెగ్గాలంటే 5 బంతుల్లో 28 పరుగులు చేయాలి. అప్పటికి రింకూ 16 బంతుల్లో 18 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అద్భుతం జరిగితే తప్ప గుజరాత్‌ జట్టే గెలవడం ఖాయమనుకున్నారు.

కానీ రింకూ తన ఆటతో అద్భుతమే చేసి చూపించాడు. ఈ ఓవర్‌ రెండో బంతిని లాంగ్‌ ఆఫ్‌ మీదుగా... మూడో బంతిని డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా... నాలుగో బంతిని లెగ్‌ సైడ్‌ దిశగా... ఐదో బంతిని లాంగ్‌ఆఫ్‌ మీదుగా సిక్స్‌లుగా మలిచాడు. దాంతో కోల్‌కతా విజయసమీకరణం 1 బంతికి 4 పరుగులుగా మారిపోయింది. కోల్‌కతా గెలుస్తుందా? గుజరాత్‌ గట్టెక్కుతుందా? మ్యాచ్‌ ‘టై’గా ముగిసి ‘సూపర్‌ ఓవర్‌’ జరుగుతుందా? అని ఉత్కంఠ ... కానీ రింకూ రఫ్ఫాడించడం ఆపలేదు. చివరి బంతిని లాంగ్‌ఆన్‌ మీదుగా సిక్స్‌ కొట్టేశాడు. అంతే కోల్‌కతా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివెరియగా... జరిగిందా కలయా, నిజమా అని గుజరాత్‌ జట్టు సభ్యులు దిగ్భ్రమ లో ఉండిపోయారు.

అంతకుముందు కోల్‌కతా 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులతో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ నితీశ్‌ రాణా (29 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి కోల్‌కతాను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. నితీశ్‌ అవుటయ్యాక రింకూతో కలిసి వెంకటేశ్‌ కోల్‌కతా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 16వ ఓవర్‌ ఐదో బంతికి జోసెఫ్‌ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెంకటేశ్‌ పెవిలియన్‌ చేరాడు.  

రషీద్‌ ఖాన్‌ ‘హ్యాట్రిక్‌’... 
కోల్‌కతా ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో మ్యాచ్‌ గుజరాత్‌ వైపు పూర్తిగా మొగ్గిపోయింది. ఈ ఓవర్లోని తొలి మూడు  బంతుల్లో వరుసగా రసెల్‌ (1), సునీల్‌ నరైన్‌ (0), శార్దుల్‌ ఠాకూర్‌ (0)లను గుజరాత్‌ తాత్కాలిక కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. దాంతో కోల్‌కతా స్కోరు 154/4 నుంచి 155/7గా మారిపోయింది. గుజరాత్‌ విజయం ఖాయమనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (6 బంతుల్లో 5 నాటౌట్‌) జతగా  రింకూ సింగ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు చిరస్మరణీయ విజయం అందించాడు.  

విజయ్‌ శంకర్‌ ధనాధన్‌... 
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు సాధించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌  పాండ్యా అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంకాగా, రషీద్‌ ఖాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. శుబ్‌మన్‌ గిల్‌ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆఖర్లో విజయ్‌  శంకర్‌ (24 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ చివరి 15 బంతుల్లో 51 పరుగులు 
పిండుకుంది. దాంతో ఆ జట్టు స్కోరు 200  పరుగులు దాటింది.   

స్కోరు వివరాలు
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) జగదీశన్‌ (బి) నరైన్‌ 17; శుబ్‌మన్‌ గిల్‌ (సి) ఉమేశ్‌ యాదవ్‌ (బి) నరైన్‌ 39; సాయి సుదర్శన్‌ (సి) అనుకూల్‌ రాయ్‌ (సబ్‌) (బి) నరైన్‌ 53; అభినవ్‌ మనోహర్‌ (బి) సుయశ్‌ శర్మ 14; విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 63; డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–33, 2–100, 3–118, 4–153. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 3–0–24–0, శార్దుల్‌ ఠాకూర్‌ 3–0–40–0, ఫెర్గూసన్‌ 4–0–40–0, సునీల్‌ నరైన్‌ 4–0–33–3, వరుణ్‌ చక్రవర్తి 2–0–27–0, సుయశ్‌ శర్మ 4–0–35–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) యశ్‌ దయాళ్‌ (బి) షమీ 15; జగదీశన్‌ (సి) మనోహర్‌ (బి) లిటిల్‌ 6; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) గిల్‌ (బి) జోసెఫ్‌ 83; నితీశ్‌ రాణా (సి) షమీ (బి) జోసెఫ్‌ 45; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 48; రసెల్‌ (సి) కేఎస్‌ భరత్‌ (సబ్‌) (బి) రషీద్‌ ఖాన్‌ 1; నరైన్‌ (సి) జయంత్‌ యాదవ్‌ (సబ్‌) (బి) రషీద్‌ ఖాన్‌ 0; శార్దుల్‌ ఠాకూర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 0; ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–20, 2–28, 3–128, 4–154, 5–155, 6–155, 7–155. 
బౌలింగ్‌: షమీ 4–0–28–1, జోష్‌ లిటిల్‌ 4–0–45–1, అల్జారి జోసెఫ్‌ 4–0–27–2, యశ్‌ దయాళ్‌ 4–0–69–0, రషీద్‌ ఖాన్‌ 4–0–37–3.

చదవండి: Venkatesh Iyer: ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి విధ్వంసం

Advertisement
Advertisement