‘పంత్‌ ఆ గీతను ఉల్లంఘించాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే’

25 Jun, 2021 19:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్లు ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఒకొక్కరూ ఒకొక్క క్రికెటర్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌కు చురకలంటించాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లీ, పుజారా ఔటైన సమయంలో పరిస్థితులు (పిచ్‌, వాతావరణం) వేరుగా ఉన్నాయని, కానీ పంత్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయానికి పరిస్థితులు చక్కబడ్డాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పంత్‌ ఘోరంగా విఫలమయ్యాడని విమర్శలు ఎక్కు పెట్టాడు. ఆఖరి రోజు తొలి 10 ఓవర్లలో పిచ్‌ అనూహ్యంగా స్పందిస్తుందని తెలిసి కూడా కోహ్లీ, పుజారాలు నిర్లక్ష్యం వహిస్తే, పంత్‌ పిచ్‌ నిర్జీవంగా మారాక కూడా వికెట్‌ పారేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టాడు. 

అప్పటికే ఒకటి, రెండు సార్లు లైఫ్‌లు లభించినా.. పంత్‌ తేరుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో చాలా సందర్భాల్లో పంత్ ఇంతకంటే చాలా మెరుగ్గా ఆడాడని, డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వదలక పోతే వేటు తప్పదని హెచ్చరించాడు. నిర్లక్ష్యానికి, అజాగ్రత్తకు మధ్య ఓ సన్నని గీత ఉంటుందని, పంత్..  దానిని ఉల్లంఘించాడని మొట్టికాయలు వేశాడు. ఎన్ని సార్లు చెప్పినా నిర్లక్ష్యపు షాట్లు ఆడి వికెట్‌ పారేసుకుంటున్నాడని, ఇకనైనా మేలుకోకపోతే గతంలో చాలా మంది స్టార్‌ క్రికెటర్లకు పట్టిన గతే అతని కూడా పడుతుందని హెచ్చరించాడు. చక్కటి డిఫెన్స్‌తోపాటు వైవిధ్యమైన షాట్లు కొట్టగల నైపుణ్యం ఉన్నప్పటికీ.. షాట్ సెలక్షన్‌ విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నాడని పేర్కొన్నాడు. 
చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్‌ ఖరారు.. ఇంగ్లండ్‌ సిరీస్‌తో షురూ

మరిన్ని వార్తలు