Sakshi News home page

WI Vs IND 1st Test: శతకాలతో చెలరేగిన రోహిత్‌, జైశ్వాల్‌.. పట్టు బిగిస్తోన్న టీమిండియా

Published Fri, Jul 14 2023 7:55 AM

Rohit-Jaiswal Centuries-India Extend Advantage Big Score-1st Test Vs WI - Sakshi

డొమినికాలోని విండ్సర్‌ పార్క్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్‌ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(221 బంతుల్లో 103 పరుగులు) కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్‌ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్‌)  క్రీజులో ఉన్నారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 80/0తో రెండోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్‌లో నెమ్మదిగా ఆడింది. తొలి సెషన్‌లో ఓపెనర్లు ఇద్దరు ఆచితూచి ఆడారు. దీంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ ఆడిన జైశ్వాల్‌ 104 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. లంచ్‌ విరామానికి టీమిండియా 146/0తో పటిష్టమైన స్థితలో నిలిచింది. 

ఇక లంచ్‌ విరామం అనంతరం టీమిండియా ఓపెనర్లు కాస్త దూకుడు చూపెట్టారు. జైశ్వాల్‌ 215 బంతుల్లో సెంచరీ సాధించి అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన మూడో ఓపెనర్‌.. ఓవరాల్‌గా 17వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 220 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకొని టెస్టుల్లో పదో శతకాన్ని అందుకున్నాడు.

సెంచరీ చేసిన మరుసటి బంతికే రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన గిల్‌(6 పరుగులు) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. స్పిన్నర్‌ వారికన్‌ బౌలింగ్‌లో అథనేజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. టీ విరామానికి టీమిండియా 245/2 స్కోరు సాధించింది. చివరి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా కోహ్లి, జైశ్వాల్‌లు ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఇక టీమిండియా చివరి సెషన్‌లో వికెట్లేమి కోల్పోకుండా 67 పరుగులు చేసింది.

చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్‌

Ind Vs WI: అతడొక అద్భుతం... చురుకైన, తెలివైన ఆటగాడు: అశ్విన్‌ ప్రశంసల జల్లు

Advertisement
Advertisement