After WTC Final Failure, Rohit Sharma Big ODI World Cup 2023 Declaration - Sakshi
Sakshi News home page

#ODIWorldCup 2023: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్‌ కొట్టబోతున్నాం: రోహిత్‌

Published Tue, Jun 13 2023 2:49 PM

Rohit Sharma Big Statement-ODI World Cup-2023-After WTC Final Failure - Sakshi

ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్‌ 209 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా అప్పటినుంచి మళ్లీ మరో కప్‌ కొట్టేలేకపోయింది. ధోని తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లి 2019 వన్డే వరల్డ్‌కప్‌ , 2021 టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. అదే ఏడాది జరిగిన 2021 డబ్ల్యూటీసీ తొలి ఛాంపియన్‌షిప్‌లోనూ కోహ్లి సారధ్యంలోని టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. 

దీంతో కోహ్లి నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్‌ శర్మకు కూడా ఏది కలిసిరావడం లేదు. 2022 టి20 వరల్డ్‌కప్‌తో పాటు ఆసియా కప్‌ 2022.. తాజాగా డబ్ల్యూటీసీ 2023లోనూ టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. పైగా టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పనికిరాడని.. వెంటనే అతన్ని తొలగించాలంటూ అభిమానులు ట్విటర్‌లో డిమాండ్‌ చేయడం ఆసక్తి కలిగించింది.

అయితే  ఈ విమర్శలు పట్టించుకోని రోహిత్‌  అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌పై తన దృష్టిని సారించాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. స్వదేశంలో మెగాటోర్నీ జరుగుతుండడంతో ఈసారి కప్‌ టీమిండియాదేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి అనుసరించబోతున్న గేమ్‌  స్ట్రాటజీని  టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వివరించాడు.

''అక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మెగాటోర్నీలో విభిన్నమైన ఆటతీరుతో రాణించేందుకు ప్రయత్నిస్తాం. తప్పకుండా అభిమానులను అలరించేందుకు తీవ్రంగా కృషి చేస్తాం. ఈ మ్యాచ్‌ గెలవాలి.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించాలని మాత్రమే ఆలోచించం. ప్రతి మ్యాచ్‌ మాకు చాలా ముఖ్యమని భావిస్తాం. అందుకోసం మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామనడంలో సందేహం లేదు. ఈసారి వన్డే వరల్డ్‌కప్‌ను విభిన్నంగా ఆడి కప్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నాం.'' అని పేర్కొన్నాడు.

కాగా రోహిత్‌ శర్మకు 2023 వన్డే వరల్డ్‌కప్‌ అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా చివరిదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అతని వయసు 36 ఏళ్లు. ఫిట్‌నెస్‌ దృష్యా చూసుకుంటే రోహిత్‌ వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత రిటైర్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

చదవండి: సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్‌; భారత్‌ ఘన విజయం

Advertisement
Advertisement