టెన్నిస్‌ స్టార్‌ సిమోనా హలెప్‌పై నిషేధం | Sakshi
Sakshi News home page

Simona Halep: టెన్నిస్‌ స్టార్‌ సిమోనా హలెప్‌పై నిషేధం

Published Fri, Oct 21 2022 9:15 PM

Romenia Tennis Star Simona Halep Provisionally Suspended For Doping - Sakshi

రొమేనియా టెన్నిస్‌ స్టార్‌.. మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ డోపింగ్‌ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్‌ ఇంటెగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ) శుక్రవారం హలెప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. విషయంలోకి వెళితే.. ఆగస్టులో యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొన్న హలెప్‌ డోపింగ్‌ టెస్టులో భాగంగా శాంపిల్‌ ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే హలెప్‌ రోక్సాడుస్టాట్(FG-4592)అనే నిషేధిత డ్రగ్‌ తీసుకున్నట్లు తేలింది. కాగా 2022లో వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) రోక్సాడుస్టాట్‌ డ్రగ్‌ను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ (TADP) ఆర్టికల్ 7.12.1 ప్రకారం 31 ఏళ్ల హలెప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఐటీఐఏ ధృవీకరించింది.

కాగా తనను సస్పెండ్‌ చేయడంపై స్పందించిన సిమోనా హలెప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ అయింది.''ఇన్నేళ్ల నా కెరీర్లో మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా మనస్సులోకి రాలేదు. ఎందుకంటే మోసం అనేది నా విలువలకు పూర్తిగా విరుద్ధం. కానీ తెలియకుండా చేసిన ఒక పని నన్ను బాధిస్తుంది. కానీ నేను తెలియక చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తా. గత 25 ఏళ్లలో టెన్నిస్‌పై పెంచుకున్న ప్రేమను, సాధించిన టైటిల్స్‌ను, గౌరవాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా'' అంటూ ముగించింది.

ఇక సిమోనా హలెప్‌ 2006లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా మారింది. ఆమె ఖాతాలో రెండు టెన్నిస్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌తో పాటు 24 డబ్ల్యూటీఏ టూర్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. 2017 నుంచి 2019 మధ్య హలెప్‌ రెండుసార్లు మహిళల టెన్నిస్‌ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణిగా కొనసాగింది. రొమేనియా తరపున ఈ ఘనత సాధించిన తొలి మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. ఆమె కెరీర్‌లో 2018లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2019లో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించింది.

చదవండి: సూపర్‌-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్‌, వివరాలు

Advertisement
Advertisement