SA vs IND 2nd Test: Dean Elgar keeps South Africa in the hunt for a win - Sakshi
Sakshi News home page

సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా?

Published Thu, Jan 6 2022 7:42 AM

SA vs IND 2nd Test: Dean Elgar keeps South Africa in the hunt for a win - Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు తొలిసారి సిరీస్‌ గెలుచుకుంటుందా? ఆతిథ్య జట్టు సిరీస్‌ను సమం చేసి పోరును మూడో టెస్టు వరకు తీసుకెళుతుందా? జొహన్నెస్‌బర్గ్‌ టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజే ఫలితం తేలనుంది. పలు మలుపులు తిరిగిన బుధవారం ఆటలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడాయి. పుజారా, రహానే భాగస్వామ్యంతో పాటు హనుమ విహారి ఆట భారత్‌ను మెరుగైన స్థితికి నడిపించగా... రబడ స్పెల్‌ సఫారీలకు ఊపిరి పోసింది. ఛేదనలోనూ ఆ జట్టు జోరుగా మొదలు పెట్టినా, తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు తీసి టీమిండియా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది. పట్టుదలగా నిలబడి మూడో రోజును సంతృప్తికరంగా ముగించిన కెప్టెన్‌ ఎల్గర్‌ ఇదే పోరాటతత్వంతో తన జట్టును గెలిపిస్తాడా లేక భారత్‌ ఎనిమిది వికెట్లు తీస్తుందా అనేది చూడాలి.

జొహన్నెస్‌బర్గ్‌: రెండో టెస్టులో భారత్‌ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని అందుకునే ప్రయత్నంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (121 బంతుల్లో 46 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), డసెన్‌ (11 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ సమం చేయాలంటే ఆ జట్టు మరో 122 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 85/2తో ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. రహానే (78 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్‌), పుజారా (86 బంతుల్లో 53; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  

రాణించిన విహారి... 
కెరీర్‌ ప్రమాదంలో పడిన దశలో, మరోసారి విఫలమైతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉన్న స్థితిలో పుజారా, రహానే కీలక ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. తమ సహజశైలికి భిన్నంగా వీరిద్దరు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో స్కోరు వేగంగా సాగిపోయింది. ఈ క్రమంలో 62 బంతుల్లోనే పుజారా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 67 బంతుల్లో రహానే కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 4.6 రన్‌రేట్‌తో 144 బంతుల్లోనే 111 పరుగులు జోడించడం విశేషం. అయితే వీరిద్దరిని ఎనిమిది పరుగుల వ్యవధిలోనే రబడ పెవిలియన్‌ పంపించగా... రిషభ్‌ పంత్‌ (0) విఫలమయ్యాడు.

ఈ దశలో విహారి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అతనికి అశ్విన్‌ (16) కొంత సహకరించగా... శార్దుల్‌ ఠాకూర్‌ (24 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు బ్యాటింగ్‌ భారత్‌ స్కోరును 200 దాటించింది. జాన్సెన్‌ వేసిన ఓవర్లో 1 సిక్స్, 2 ఫోర్లు కొట్టిన శార్దుల్‌ అదే ఓవర్‌ చివరి బంతికి అవుటయ్యాడు. అనంతరం విహారి కొన్ని విలువైన పరుగులు జోడించాడు. భారత్‌ జోడించిన చివరి 41 పరుగుల్లో విహారినే 30 పరుగులు చేశాడు.  

ఎల్గర్‌ పట్టుదలగా..
రెండో ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. మార్క్‌రమ్‌ (38 బంతుల్లో 31; 6 ఫోర్లు) దూకుడుతో జట్టు స్కోరు 10 ఓవర్లలోనే 47 పరుగులకు చేరింది. పదో ఓవర్‌ చివరి బంతికే మార్క్‌రమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని శార్దుల్‌ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత పీటర్సన్‌ (28; 4 ఫోర్లు) కూడా రాణించాడు. దాంతో సఫారీ టీమ్‌ 93/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అశ్విన్‌ చక్కటి బంతితో పీటర్సన్‌ను ఎల్బీగా అవుట్‌ చేయడంతో మళ్లీ భారత్‌దే పైచేయి అయింది. ఈ స్థితిలో ఎల్గర్, డసెన్‌ పట్టుదల కనబర్చారు. చేతికి, భుజానికి, మెడకు, ఛాతీకి... భారత పేసర్ల పదునైన బంతులకు ఇలా అన్ని శరీర భాగాలకు దెబ్బలు తగులుతున్నా ఎల్గర్‌ పిచ్‌పై దృఢంగా నిలబడ్డాడు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా మరో వికెట్‌ తీయలేకపోయారు.

చదవండి: Shardul Thakur: శార్ధూల్‌ పేరు ముందు "ఆ ట్యాగ్‌" వెనుక రహస్యమిదే..!

Advertisement
Advertisement