క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌.. నమ్మశక్యం కాని రీతిలో..! | SA20 2024: Romario Shepherd Takes An Absolute Screamer In Match Against Durban Super Giants, Video Viral - Sakshi
Sakshi News home page

SA20 2024: క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌.. నమ్మశక్యం కాని రీతిలో..!

Published Tue, Jan 16 2024 7:11 AM

SA20 2024: Romario Shepherd Takes An Absolute Screamer In Match Against Durban Super Giants - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. విండీస్‌ ఆటగాడు, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అందుకున్నాడు. నిన్న (జనవరి 15) డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ బ్రీట్జ్కీ కొట్టిన షాట్‌ను రొమారియో షెపర్డ్‌ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌గా మలిచాడు.

షెపర్డ్‌ కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టుకుని క్రికెట్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. ఇది చూసిన వారు తాము చూస్తున్నది నిజమేనా అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

బౌలర్‌ నండ్రే బర్గర్‌ అయితే ఈ క్యాచ్‌కు చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, రొమారియో షెపర్డ్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో అలరించినప్పటికీ ఈ మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు సూపర్‌ జెయింట్స్‌ చేతిలో 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్వల్ప ఛేదనలో సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమై ఓటమిని కొనితెచ్చుకున్నారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (64) ఒక్కడే  అర్ధసెంచరీతో రాణించాడు. లిజాడ్‌ విలియమ్స్‌ (4/26) సూపర్‌ జెయింట్స్‌ పతనాన్ని శాశించాడు.

అనంతరం రీస్‌ టాప్లే (3/19), రిచర్డ్‌ గ్లీసన్‌ (2/22), కేశవ్‌ మహారాజ్‌ (2/17) చెలరేగడంతో సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. రీజా హెండ్రిక్స్‌ (38), మొయిన్‌ అలీ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 16) ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ తలపడనున్నాయి. 

Advertisement
Advertisement