విదేశీ కోచ్‌లు కాదు... వ్యవస్థ బాగుండాలి

28 May, 2021 03:07 IST|Sakshi

పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయం

న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విదేశీ కోచ్‌ల రాకతో మొత్తం మారిపోతుందనుకుంటే పొరపాటని... ముందు వ్యవస్థ బాగుంటేనే అన్ని బాగుంటాయని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. ‘మన క్రీడా ప్రగతికి విదేశీ కోచ్‌లు కీలక భూమిక పోషిస్తారు. నిజానికి వారి సేవలు అవసరం కూడా.... భిన్నదేశాలకు చెందిన కోచ్‌ల మేళవింపు మనకు మేలు చేస్తుంది. క్రీడల్లో మనకు నైపుణ్యం లేని చోట ప్రారంభ దశలో విదేశీ సహాయ బృందాలు కావాల్సిందే. అయితే విజయవంతంగా రాణిస్తున్న జట్లకూ విదేశీ కోచ్‌లే ఉండాలంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. దీని వల్ల మన వ్యవస్థకు న్యాయం జరగదు. విదేశీ కోచ్‌లను సలహాదారులుగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమైన కోచింగ్‌ బాధ్య తలు, అధికారాలు స్వదేశీ కోచ్‌లకే అప్పజెప్పాలి. ఆటగాళ్లు విదేశీ కోచ్‌ల నుంచి నేర్చుకోవడం ముఖ్యమే. అలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను వదులుకోవాలి. ఎందుకంటే వాళ్లు మనల్ని ద్వితీయ శ్రేణి జట్టుగానే తయారు చేస్తున్నారు. కారణం వాళ్లూ ద్వితీయ శ్రేణి కోచ్‌లే! వాళ్ల దేశంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి ఆటగాళ్లకు సేవలందిస్తారు. రెండో ఉత్తమ కోచ్‌లు ఇతర దేశాలకు తరలి వెళతారు’ అని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు