జీవా ధోనికి భద్రత పెంపు | Sakshi
Sakshi News home page

జీవా ధోనికి భద్రత పెంపు

Published Sat, Oct 10 2020 6:07 PM

Security Tightened For Ziva Dhoni For Getting Threat In Ranchi - Sakshi

రాంచీ : ఎంఎస్‌ ధోని గారాల పట్టి జీవాపై కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్‌గా స్పందించిన జార్ఖండ్‌ ప్రభుత్వం శనివారం అప్రమత్తమైంది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని.. ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. దీంతో పాటు రాంచీలోని ధోని ఇంటి వద్ద జీవాకు రక్షణగా అదనపు భద్రతను కల్పిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. (చదవండి : జీవా ధోనిపై విషం చిమ్మిన నెటిజన్లు)

దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్‌ చేజారిపోయిందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్‌ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే తనపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్‌ వీళ్లకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించి శుభారంభం చేసినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొదటి మ్యాచ్‌ విజయం తర్వాత వరుసగా హాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసిన చెన్నై.. కింగ్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చినట్లు కనబడింది. కానీ కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. కాగా సీఎస్‌కే నేడు(శనివారం) దుబాయ్‌ వేదికగా ఆర్‌సీబీతో తలపడనుంది. (చదవండి : ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్‌ కార్తీక్‌..)

Advertisement
Advertisement