గంభీర్‌ను ఎవరూ ఇష్టపడే వారు కాదన్న అఫ్రిది.. భజ్జీ రియాక్షన్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

29 Aug, 2022 16:15 IST|Sakshi

టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌పై పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అవకాశం దొరికినప్పుడంతా అక్కసు వెల్లగక్కడం మనం తరుచూ గమనిస్తూనే ఉన్నాం. 2007లో ఓ వన్డే మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవే ఈ ఇద్దరి మధ్య వైరానికి కారణం. నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 

తాజాగా ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో అఫ్రిది మరోసారి గంభీర్‌పై తన విధ్వేషాన్ని బయటపెట్టాడు. తనకు భారత్‌ ఆటగాళ్లతో ఎలాంటి గొడవలు లేవంటూనే.. గంభీర్‌ వ్యక్తిత్వంపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. గంభీర్‌ది భిన్నమైన మనస్తత్వమని.. అతన్ని నాటి భారత జట్టులో ఎవరూ ఇష్టపడేవారు కాదని విషం చిమ్మాడు. 

అయితే అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు విని చర్చలో పాల్గొన్న టీమిండియా మాజీ స్పిన్నర్‌, గౌతీ సహచరుడు హర్భజన్‌ సింగ్‌ పకపకా నవ్వడం భారత అభిమానులను విస్మయానికి గురి చేసింది. సహచరుడు, తోటీ ఎంపీని ప్రత్యర్ధి దేశానికి చెందిన వ్యక్తి విమర్శిస్తుంటే, ఇలానా నువ్వు ప్రవర్తించేది అంటూ భజ్జీపై జనం మండిపడుతున్నారు. 

ఈ విషయమై భజ్జీని సోషల్‌మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓ పక్క అఫ్రిదికి చురకలంటిస్తూనే.. గంభీర్‌ను వెనకేసుకొస్తూ, భజ్జీని తప్పుబడుతున్నారు. గంభీర్‌ గురించి అవాక్కులు చవాక్కులు పేలితే ‍కబడ్దార్‌ అంటూ అఫ్రిదిని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా, ఒకనాటి సహచరులైన గంభీర్‌, హర్భజన్‌ ప్రస్తుతం వేర్వేరు రాజకీయ పార్టీల తరఫున ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 


చదవండి: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌!

Poll
Loading...

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు