Updated WTC Points Table: పాకిస్తాన్‌కు శ్రీలంక షాక్‌.. టీమిండియా తర్వాతి స్థానంలో బాబర్‌ ఆజం బృందం!

28 Jul, 2022 16:19 IST|Sakshi
పాకిస్తాన్‌కు షాకిచ్చిన శ్రీలంక(PC: Sri Lanka Cricket Twitter)

ICC World Test Championship 2021-23 Updated Table: సొంతగడ్డపై మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది శ్రీలంక జట్టు. స్పిన్నర్లు ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండిస్‌ చెలరేగడంతో రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఏకంగా 246 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. 

కాగా ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో బాబర్‌ ఆజం బృందం 4 వికెట్ల తేడాతో గెలుపొంది డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

ఈ క్రమంలో రెండో టెస్టులో తాజా విజయం నేపథ్యంలో కరుణరత్నె సేన పాకిస్తాన్‌ స్థానాన్ని ఆక్రమించింది. భారత్‌, పాకిస్తాన్‌లను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. దీంతో పాక్‌ మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోగా.. టీమిండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 

అగ్రపీఠం నిలబెట్టుకున్న ప్రొటిస్‌ జట్టు!
ఇక దక్షిణాఫ్రికా అగ్రపీఠాన్ని నిలబెట్టుకోగా.. ఆస్ట్రేలియా రెండో స్థానాన్ని కాపాడుకుంది. కాగా డబ్లూటీసీ 2021-23 సీజన్‌కు గానూ ఇప్పటి వరకు ఐదు గెలిచిన సౌతాఫ్రికాకు 60 పాయింట్లు(71.43శాతం) వచ్చాయి.


PC: ICC

ఇక పదింటికి ఆరు గెలిచిన కంగారూ జట్టు ఒక మ్యాచ్‌ ఓడగా.. మూడు డ్రా చేసుకుని 84 పాయింట్ల(70 శాతం)తో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక పాక్‌పై గెలుపొందడంతో శ్రీలంక విజయాల సంఖ్య ఐదుకు చేరుకుంది. లంక ఖాతాలో నాలుగు పరాజయాలు ఉన్నాయి. ఒక మ్యాచ్‌ డ్రా అయ్యింది కూడా! దీంతో శ్రీలంకకు లభించిన పాయింట్లు 64(53.33 శాతం).

టీమిండియా తర్వాతి స్థానంలో పాక్‌!
టీమిండియా ఆరు విజయాలు, 4 పరాజయలు, రెండు డ్రా చేసుకుని 75 పాయింట్లు(52.08 శాతం), పాకిస్తాన్‌ నాలుగు విజయాలు, మూడు పరాజయాలు, రెండు డ్రా చేసుకుని 56 పాయింట్లు(51.85 శాతం) సాధించింది. ఐదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ నాలుగు విజయాలు, మూడు పరాజయాలు, రెండు డ్రా చేసుకుని 54 పాయింట్ల(50 శాతం)తో ఆరో స్థానంలో ఉంది.

ఇక టాప్‌-2లో గెలిచిన రెండు జట్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. మొదటి డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించిన టీమిండియా.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలై టైటిల్‌ చేజార్చుకుంది. తద్వారా డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా విలియమ్సన్‌ బృందం క్రికెట్‌ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. 
చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్‌.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!
IND Vs WI, 3rd ODI: ఆర్‌సీబీ అత్యుత్సాహం.. గిల్‌ విషయంలో తప్పుడు ట్వీట్‌

మరిన్ని వార్తలు