క్లాసెన్‌ కమాల్‌ ఇంగ్లండ్‌ ఢమాల్‌ | Sakshi
Sakshi News home page

క్లాసెన్‌ కమాల్‌ ఇంగ్లండ్‌ ఢమాల్‌

Published Sun, Oct 22 2023 3:55 AM

South Africa won by 229 runs against England - Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆట ఇంతేనా అనిపించేలా... అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో చెత్త ప్రదర్శన చూపిస్తూ... ఇంగ్లండ్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కొత్త వ్యూహం, కీలక మార్పులతో బరిలోకి దిగి టాస్‌ నెగ్గిన అనుకూలతను కూడా సొమ్ము చేసుకోలేక చేతులెత్తేసింది. వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్‌ నిలబెట్టుకోవడానికి వచ్చిన జట్టు టి20లా 22 ఓవర్లకే ఆలౌట్‌ కావడమేంటి... కూన అఫ్గాన్‌ చేతిలో ఓడిన జట్టు ఇక ఆదమరిస్తే కురదని అన్నీ అస్త్ర శస్త్రాలకు పదునుపెట్టి బలమైన ప్రత్య ర్థితో సై అంటుంది.

కానీ ఇంగ్లండ్‌ తీరు చూస్తే అస్త్ర శస్త్రాలన్నీ అటకమీద పెట్టి మైదానంలో ఏదోలా ఆడేందుకు వచ్చినట్లుగా అనిపించింది. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన చేదు అనుభవాన్ని మరచి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. బ్యాటర్ల బాధ్యత, అందరి బౌలర్ల సమష్టి కృషి వరల్డ్‌కప్‌లో  సఫారీలకు అసాధారణ విజయాన్నిచ్చింది. ఈ గెలుపులోక్లాసెన్, జాన్సెన్‌ జట్టు హీరోలుగా నిలిచారు.  

ముంబై: ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌లా ఆడలేదు. దక్షిణాఫ్రికాలాంటి పటిష్టమైన జట్టు చేతిలో సాదాసీదా క్రికెట్‌ కూనలా ఓడింది. బౌలింగ్‌లో విలాపం, బ్యాటింగ్‌లో వైఫల్యంతో ఇంగ్లండ్‌ చిత్తయింది. శనివారం జరిగిన ప్రపంచకప్‌లో పోరులో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ని ర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రిచ్‌ క్లాసెన్‌ (67 బంతుల్లో 109; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సునామీ ఆటతో సెంచరీ సాధించగా,  రీజా హెండ్రిక్స్‌ (75 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో జాన్సెన్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), వాన్‌డర్‌ డసెన్‌ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు) చెలరేగారు.

హెండ్రిక్, డసెన్‌ 116 బంతుల్లో 121 పరుగులు జోడించగా... క్లాసెన్, జాన్సెన్‌ ఓవర్‌కు 12 పరుగుల రన్‌రేట్‌తో 12.5 ఓవర్లలోనే 151 పరుగులు జత చేయడం విశేషం. 61 బంతుల్లోనే క్లాసెన్‌ సెంచరీ పూర్తయింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌  22 ఓవర్లు మాత్రమే ఆడి 170 పరుగుకే కుప్పకూలింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్‌ వుడ్‌ (17 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తప్ప ఇంకెవరూ చెప్పుకునేంత స్కోరు, జట్టు పరువు నిలిపే పోరాటమైనా చేయలేకపోయారు.

ప్రధాన బ్యాటర్లంతా విఫలం కాగా, చివర్లో వుడ్‌ పోరాటం ఆ జట్టు అట్టడుగునకు చేరకుండా ఆపింది.  400 పరుగుల  లక్షాన్ని చూడగానే భీతిల్లినట్లుగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వరుస కునారిల్లింది. టాపార్డర్‌లో బెయిర్‌ స్టో (10), మలాన్‌ (6), రూట్‌ (2) కలిపి చేసిన స్కోరు 18 దాటలేదు. మిడిలార్డర్‌లో బ్రూక్‌ (17), బట్లర్‌ (15), విల్లీ (12) రెండంకెల స్కోర్లు చేశారంతే. టెయిలెండర్‌ అట్కిన్సన్‌ (21 బంతుల్లో 35; 7 ఫోర్లు) కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచాడు. తాజా ఫలితంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది.

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) బట్లర్‌ (బి) టాప్లీ 4; హెండ్రిక్స్‌ (బి) రషీద్‌ 85; డసెన్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 60; మార్క్‌రమ్‌ (సి) బెయిర్‌స్టో (బి) టాప్లీ 42; క్లాసెన్‌ (బి) అట్కిన్సన్‌ 109; మిల్లర్‌ (సి) స్టోక్స్‌ (బి) టాప్లీ 5; జాన్సెన్‌ నాటౌట్‌ 75; కోయెట్జీ (సి) సబ్‌–లివింగ్‌స్టోన్‌ (బి) అట్కిన్సన్‌ 3; కేశవ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–4, 2–125, 3–164, 4–233, 5–243, 6–394, 7–398. వికెట్ల పతనం: 1–4, 2–125, 3–164, 4–233, 5–243, 6–394, 7–398. బౌలింగ్‌: టాప్లీ 8.5–0–88–3, విల్లీ 9–1–61–0, రూట్‌ 6.1–0–48–0, అట్కిన్సన్‌ 9–0–60–2, వుడ్‌ 7–0–76–0, ఆదిల్‌ రషీద్‌ 10–0–61–2.   

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌ స్టో (సి) డసెన్‌ (బి) ఇన్‌గిడి 10; మలాన్‌ (సి) డికాక్‌ (బి) జాన్సెన్‌ 6; జో రూట్‌ (సి) మిల్లర్‌ (బి) జాన్సెన్‌ 2; స్టోక్స్‌ (సి) అండ్‌ (బి) రబడ 5; బ్రూక్‌ (ఎల్బీ) (బి) కోయెట్జీ 17; బట్లర్‌ (సి) డికాక్‌ (బి) కోయెట్జీ 15; విల్లీ (సి) రబడ (బి) ఇన్‌గిడి 12; ఆదిల్‌ రషీద్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) కోయెట్జీ 10; అట్కిన్సన్‌ (బి) కేశవ్‌ 35; వుడ్‌ నాటౌట్‌ 43; టోప్లీ ఆబ్సెంట్‌హర్ట్‌ ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (22 ఓవర్లలో ఆలౌట్‌) 170. వికెట్ల 
పతనం: 1–18, 2–23, 3–24, 4–38, 5–67, 6–68, 7–84, 8–100, 9–170. బౌలింగ్‌: ఇన్‌గిడి 5–1–26–2, జాన్సెన్‌ 5–0–35–2, రబడ 6–1–38–1, కోయెట్జీ 4–0–35–3, కేశవ్‌ 2–0–27–1. 

Advertisement
Advertisement