ఇది నాటౌటా?.. అంపైర్‌ నిర్ణయంపై విస్మయం.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

SL vs BAN: ఇది నాటౌటా?.. అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం.. వీడియో వైరల్‌

Published Thu, Mar 7 2024 7:41 AM

Sri Lankan Players Enraged After Third Umpires over turn In Soumya Sarkars Dismissal - Sakshi

సెల్హాట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి బంగ్లా ఛేదించింది. ఇక ఇది ఇలా ఉండగా..  మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది. క్లియర్‌గా ఔటైనప్పటికి థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడం వివాదానికి దారితీసింది.

ఏం జరిగిందంటే?
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ వేసిన బినురా ఫెర్నాండో తొలి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న  సౌమ్య సర్కార్ ఫుల్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ అప్పీల్‌ చేయగానే ఫీల్డ్‌ అంపైర్‌ వెంటనే ఔట్‌ అని వేలు పైకెత్తాడు. కానీ సర్కార్‌ మాత్రం డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. ఆల్ట్రాఎడ్జ్‌లో కూడా స్పైక్‌ రావడం స్క్రీన్‌లో కన్పిచండంతో సర్కార్‌ సైతం మైదానాన్ని వీడేందుకు సిద్దమయ్యాడు.

కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బ్యాట్‌కు బంతికి క్లియర్‌ గ్యాప్‌ ఉందని థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు, ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌లు సైతం షాకయ్యారు. ఈ క్రమంలో లంక ఆటగాళ్లు అంపైర్‌లతో వాగ్వదానికి దిగారు. ఆ తర్వాత అంపైర్‌లు నచ్చచెప్పడంతో ఆట తిరిగి మళ్లీ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా ఔట్‌.. అంపైర్‌కు కళ్లు కన్పిచండం లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement