Stuart Broad On Course To Receive Knighthood Says Reports - Sakshi
Sakshi News home page

స్టువర్ట్‌ బ్రాడ్‌కు అత్యున్నత గౌరవం.. "సర్‌" స్టువర్ట్‌ బ్రాడ్‌గా..!

Published Sun, Aug 6 2023 4:48 PM

Stuart Broad On Course To Receive Knighthood Says Reports - Sakshi

కొద్ది రోజుల కిందట క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ దిగ్గజం స్టువర్ట్‌ బ్రాడ్‌కు అత్యున్నత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్‌కు, ముఖ్యంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌కు చేసిన సేవలకు గాను బ్రాడ్‌కు నైట్‌హుడ్‌ ఇవ్వాలని యూకే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్‌ నివేదిక ప్రకారం​.. యూకే ఎంపీలంతా బ్రాడ్‌కు నైట్‌హుడ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట. క్రికెట్‌ అభిమానులు, సాధారణ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తుందట. బ్రాడ్‌ నైట్‌హుడ్‌కు అర్హుడని యూకే ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ కూడా తీర్మానించిందట. ఇందుకు ఆ దేశ ప్రధాని రిషి సునక్‌ కూడా సుముఖంగా ఉన్నాడట. ఈ విషయాలను డైలీ మెయిల్‌ ఓ కథనంలో పేర్కొంది.

ఒకవేళ బ్రాడ్‌కు నైట్‌హుడ్‌ ఇస్తే.. అతని పేరుకు ముందు "సర్‌" వచ్చి చేరుతుంది. క్రికెట్‌లో అతి తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది. సర్‌ బిరుదు తొలుత ఇంగ్లండ్‌ ఆటగాడు ఫ్రాన్సిస్‌ ఎడెన్‌ లేసీ (1895-1946)కి దక్కింది. ఆతర్వాత క్రికెట్‌ దిగ్గజం​, ఆసీస్‌ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌, జాక్‌ హాబ్స్‌ (ఇంగ్లండ్‌), లెన్‌ హటన్‌ (ఇంగ్లండ్‌), రిచర్డ్‌ హ్యాడ్లీ (న్యూజిలాండ్‌), గ్యారీ సోబర్స్‌ (విండీస్‌), కర్ట్లీ ఆంబ్రోస్‌ (విండీస్‌), అలిస్టర్‌ కుక్‌ (ఇంగ్లండ్‌), ఆండ్రూ స్ట్రాస్‌ (ఇంగ్లండ్‌) వంటి పలువురు క్రికెట్‌ దిగ్గజాలు నైట్‌హుడ్‌ దక్కించుకున్నారు. భారత క్రికెటర్లలో విజయనగరం మహారాజ్‌కుమార్‌కు నైట్‌హుడ్‌ దక్కినప్పటికీ, అతనికి క్రికెటేతర కారణాల చేత ఈ గౌరవం దక్కింది.

కాగా, ఇటీవల ముగిసిన యాషెస్‌ సిరీస్‌-2023 ఆఖరి టెస్ట్‌, మూడో రోజు ఆట సందర్భంగా స్టువర్ట్‌ బ్రాడ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి 2 టెస్ట్‌లు ఓడిపోయి వెనుకపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-2తో డ్రా చేసుకుంది.

ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ విజయాల్లో బ్రాడ్‌ కీలకపాత్ర పోషించాడు. 22 వికెట్లతో సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. బ్రాడ్‌ అంతర్జాతీయ కెరీర్‌లో తానెదుర్కొన్న చివరి బంతిని సిక్సర్‌గా, తాను సంధించిన చివరి బంతిని వికెట్‌గా మలిచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఓవరాల్‌గా బ్రాడ్‌ టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వికెట్‌ టేకర్‌గా (604), ఓవరాల్‌గా ఏడో అత్యధిక వికెట్‌ టేకర్‌గానూ (847) రికార్డుల్లో నిలిచాడు.

Advertisement
Advertisement