IPL 2024: Sunrisers Hyderabad Might Be Released Harry Brook: Reports - Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా

Published Mon, Jul 31 2023 12:53 PM

Sunrisers hyderabad might be released harry brook: reports - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబరిచి అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఈ ఏడాది సీజన్‌లో కొత్త కెప్టెన్‌, కొత్త హెడ్‌కోచ్‌తో బరిలోకి దిగినప్పటికీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆట తీరు​ మాత్రం మారలేదు. ఐపీఎల్‌ 2023లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్‌ ఆర్మీ.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది.

13 కోట్ల ఆటగాడికి గుడ్‌ బై..
ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు సమాచారం. అదే విధంగా గత సీజన్‌లో నిరాశపరిచిన కొంతమంది ఆటగాళ్లను కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ వదులుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో ముందు వరుసలో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

హ్యారీ బ్రూక్ కోసం సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి ఎస్‌ఆర్‌హెచ్‌ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. మరోవైపు  రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్‌, యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది.

సుందర్‌ గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకోగా.. మాలిక్‌ మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్‌.. 5 వికెట్లు మాత్రమే చేశాడు. వీరితో పాటు మరికొంత మందికి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.
చదవండి: WC 2023: టీ20 వరల్డ్‌కప్‌ మాదిరే ఈసారి కూడా! ఇషాన్‌ను ఆడిస్తే రోహిత్‌ ‘డ్రాప్‌’.. మరి కోహ్లి సంగతి?

Advertisement
Advertisement