T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్‌ చేస్తాడు: ఫించ్‌ | Sakshi
Sakshi News home page

T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్‌ చేస్తాడు: ఫించ్‌

Published Wed, Oct 6 2021 12:32 PM

T20 World Cup: David Warner To Open For Australia Confirms Aaron Finch - Sakshi

Aaron Finch Comments On David Warner: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో డేవిడ్‌ వార్నర్‌ ఓపెనర్‌గా మైదానంలో దిగుతాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ స్పష్టం చేశాడు. తమ జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్‌ ఒకడని ప్రశంసలు కురిపించాడు. అతడు కచ్చితంగా మెగా ఈవెంట్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డేవిడ్‌ వార్నర్‌కు ఈ సీజన్‌ అస్సలు కలిసి రాలేదన్న సంగతి తెలిసిందే.

కోవిడ్‌ కారణంగా ఐపీఎల్‌-2021 వాయిదా పడేనాటికే కెప్టెన్సీ సహా తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. రెండో అంచెలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా సద్వినియోగం(0, 2 పరుగులు) చేసుకోలేకపోయాడు. దీంతో మరోసారి వార్నర్‌ను పక్కనపెట్టేశారు. ఇక ఐపీఎల్‌ ముగిసిన రెండు రోజుల వ్యవధిలో.. టీ20 ప్రపంచకప్‌(అక్టోబరు 17) మొదలుకానున్న నేపథ్యంలో ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. వార్నర్‌ ఫామ్‌ గురించిన ఆందోళనల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

పత్రికా సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ... టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో వార్నరే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతాడని పేర్కొన్నాడు. ‘‘ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అత్యుత్తమ ఆటగాళ్లలో తనూ ఒకడు. మెగా ఈవెంట్‌కు తన సన్నాహకాల గురించి నాకు ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్‌కు ఆడటాన్ని తను ప్రేమిస్తాడు. కాబట్టి.. తను ప్రాక్టీసు చేస్తూనే ఉంటాడు. కచ్చితంగా ఐసీసీ టోర్నీలో రాణిస్తాడనే నమ్మకం ఉంది’’ అని ఫించ్‌ సహచర ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. 

ఇక గతేడాది సెప్టెంబరులో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా ఆసీస్‌ తరఫున మైదానంలో దిగిన వార్నర్‌.. టీ20 ప్రపంచకప్‌లో జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా.. మోకాలి నొప్పి కారణంగా... బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన ఫించ్‌.. తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు. ఐసీసీ టోర్నీకి ముందు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధిస్తాననే నమ్మకం ఉందని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నాడు.

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్‌ రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా

రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్.

చదవండి: T20 World Cup 2021: భారత జట్టులో మార్పులు చేయనవసరం లేదు..

Advertisement
Advertisement