T20 World Cup 2022: South Africa Vs Zimbabwe Match Called Off Due To Rain - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: సౌతాఫ్రికాను వంచించిన వరుణుడు

Published Mon, Oct 24 2022 6:36 PM

= T20 World Cup: South Africa Vs Zimbabwe Match Called Off Due To Rain - Sakshi

క్రికెట్‌ చరిత్రలో దక్షిణాఫ్రికాకు మించిన దురదృష్టమైన జట్టు మరొకటి లేదన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. గెలుపు వాకిట నిలిచిన చాలా సందర్భాల్లో ఆ జట్టును దురదృష్టం ఏదో ఒక రూపంలో వెంటాడుతూ వస్తుంది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌-2022లో అలాంటి సీనే మరోసారి రిపీటయ్యింది.

సూపర్‌-12 గ్రూప్‌-2 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 24) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ను వరుణుడు వంచించాడు. గెలుపు దాకా వచ్చిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాయింట్లు కోల్పోవడంతో సఫారీల బాధ వర్ణణాతీతంగా ఉంది. 

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వరుణుడు ఆటంకం కలిగించడంతో 9 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే విరుచుకుపడినప్పటికీ వర్షం పదే పదే అంతరాయం కలిగించి చివరకు సఫారీలకు గెలుపు దక్కనివ్వకుండా చేసింది.

81 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఓపెనర్‌ డికాక్‌ (18 బంతుల్లో 47 నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) వీరలెవెల్లో విజృంభించడంతో 3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. 1.1 ఓవర్ల తర్వాత వర్షం ప్రారంభం కావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 7 ఓవర్లలో 64 పరుగుల లక్ష్యాన్ని సఫారీలను నిర్ధేశించారు.

మూడో ఓవర్‌ తర్వాత మళ్లీ ప్రారంభమైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 13 పరుగులు చేస్తే మ్యాచ్‌ గెలిచే సమయంలో వరుణుడు ఇలా గెలుపును అడ్డుకోవడంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ముఖాలన్నీ మాడిపోయాయి. ఇదెక్కడి దురదృష్టంరా బాబు అని ఆ జట్టు అభిమానులు వాపోతున్నారు. సఫారీ టీమ్‌ను దురదృష్టం అదృష్టం పట్టినట్లు పట్టింది అంటూ క్రికెట్‌ ఫాలోవర్స్‌ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: వరుణుడి ఆటంకం.. 9 ఓవర్ల మ్యాచ్‌.. సాతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..?

Advertisement

తప్పక చదవండి

Advertisement