టీమిండియాకు ఎదురు‘దెబ్బలు’ | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఎదురు‘దెబ్బలు’

Published Sat, Jan 9 2021 1:34 PM

Team India Injury Worries Deepen - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు గాయాల బెడద వేధిస్తోంది. వరుసగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ప్రస్తుతం మూడో టెస్టు జరుగుతుండగా, ఇంకా టెస్టు మ్యాచ్‌ మిగిలి ఉంది. ఇప్పటికే ఇరు జట్లు తలో మ్యాచ్‌లో గెలిచి సమంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌లు గాయాల బారిన పడి పర్యటన నుంచి అర్థాంతరంగా నిష్క్రమించగా, ఇప్పుడు రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు సైతం గాయాలు పాలయ్యారు.  

ఆసీస్‌తో మూడో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో(శనివారం) బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో వీరిద్దరూ గాయపడ్డారు. పంత్‌ మోచేతికి గాయం కాగా, జడేజా ఎడమ చేతి వేలికి గాయమైంది. ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో గాయపడ్డ పంత్‌ తీవ్ర నొప్పితో సతమతమయ్యాడు. కానీ మోచేతికి బ్యాండేజ్‌ వేసుకుని ఔటయ్యే వరకూ బ్యాటింగ్‌ కొనసాగించాడు పంత్‌. ఇక మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో జడేజా చేతి వేలికి బంతి బలంగా తాకింది. జడేజా కూడా బ్యాండేజ్‌ వేసుకునే బ్యాటింగ్‌ కొనసాగించాడు.  (అప్పుడూ ఇదే సీన్‌.. మరి టీమిండియా గెలిచేనా?)

ఫీల్డింగ్‌కు రాలేదు..
జడేజా, పంత్‌లు ఇద్దరూ గాయపడటంతో వీరిద్దరూ ఫీల్డింగ్‌ చేయడానికి రాలేదు. పంత్‌ స్థానంలో సాహా కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రాగా,  జడేజా స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. వీరిద్దరికి స్కానింగ్‌ చేసిన తర్వాత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ వారి గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని స్కానింగ్‌ రిపోర్ట్‌లో తేలితే వీరు కూడా దూరం కావడం ఖాయం. వరుసగా గాయం కారణంగా టీమిండియా ఆటగాళ్లు దూరం కావడం ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. ఇంకా మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ ఆడాల్సిన తరుణంలో పంత్‌, జడేజాలు గాయాలు పాలు కావడం గట్టి ఎదురుదెబ్బ.  (వాటే సెన్సేషనల్‌ రనౌట్‌..!)

Advertisement
Advertisement