Daria Kasatkina: 'నేనొక లెస్బియన్‌'.. రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు

19 Jul, 2022 19:42 IST|Sakshi

రష్యన్‌ మహిళా టెన్నిస్‌ స్టార్‌.. ప్రపంచ నెంబర్‌ 12.. డారియా కసత్కినా స్వలింగ సంపర్కంపై సంచలన ఆరోపణలు చేసింది. తాను లెస్బియన్‌ అని సగర్వంగా చెప్పుకుంటున్నాని.. ఎల్జీబీటీక్యూ(LGBTQ), హోమో సెక్సువల్‌పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది. ఇటీవలే రష్యా ప్రజా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాలపై  సమాచారాన్ని నిషేధించే మరిన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది. దీంతో దేశంలో స్వలింగ సంపర్కులు కన్నెర్రజేశారు. 

తాను లెస్బియన్  అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా  ప్రకటించిన కసత్కినా.. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ  ‘మై క్యూటీ పై’ అని షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.  ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో నిషేధించడానికి ఉన్నాయి. అయితే  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమేమీ షాకింగ్ గా అనిపించలేదు..ప్రభుత్వం చెప్పినట్టు మీ భాగస్వామితో గదిలోనే జీవించడం, బయట మాట్లాడకపోవడం అనే దాంట్లో అర్థం లేదు. మీరు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది మీ ఇష్టం. ఏం చెప్పాలి..? ఏం చెప్పకూడదు అనేది వ్యక్తులకు సంబంధించిన విషయం.’అని తెలిపింది. 

కాగా గతవారం రష్యన్‌ మహిళా ఫుట్‌బాలర్‌  నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కంపై తనదైన శైలిలో స్పందించింది. కసత్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ  ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా  అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి.’ అని పేర్కొంది.

చదవండి: World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ

మరిన్ని వార్తలు