జింబాబ్వేకు బిగ్‌ షాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా ఆర్హత | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: జింబాబ్వేకు బిగ్‌ షాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా ఆర్హత

Published Thu, Nov 30 2023 4:34 PM

Uganda Create History With T20 World Cup 2024 Qualification; - Sakshi

ఉగాండా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. యూఎస్‌ఎ, వెస్టిండీస్‌ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2024కు ఉగాండా అర్హత సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆఫ్రికన్ రీజినల్ క్వాలిఫియర్స్‌లో భాగంగా గురువారం రువాండాతో జరిగిన ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉగాండా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్వాలిఫియర్స్‌లో భాగంగా ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ఉగాండా పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రువాండా కేవలం 65 పరుగులకే ఆలౌటైంది.  ఉగండా బౌలర్లలో అల్పేష్ రాంజానీ,  దినేష్ నక్రానీ, మసబా, స్సెన్యోండో తలా రెండు వికెట్లతో రువాండా పతనాన్ని శాసించారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉగండా కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ​కాగా ఉగండా విజయంతో మరో ఆఫ్రికా జట్టు జింబాబ్వే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది.

పాయింట్ల పట్టికలో జింబాబ్వే మూడో స్ధానంలో నిలిచింది. ఈ క్వాలిఫై టోర్నీలో భాగంగా ఉగండా చేతిలో 5 వికెట్ల తేడాతో జింబాబ్వే  ఓటమి చవిచూసింది. అప్పుడే జింబాబ్వే వరల్డ్‌కప్‌ క్వాలిఫై ఆశలు గల్లంతయ్యాయి. ​ఇక ఆఫ్రికన్ రీజినల్ క్వాలిఫియర్స్‌ నుంచి ఉగండాతో పాటు నబీబియా కూడా టీ20 ప్రపంచకప్‌-2024కు క్వాలిఫై అయింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ఆర్హత సాధించిన ఐదో ఆఫ్రికన్‌ జట్టుగా ఉగాండా నిలిచింది.

20 జట్లు బరిలోకి.. 
2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి.  ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే  12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌.. టీ20 వరల్డ్‌కప్‌-2022 టాప్‌-8లో నిలిచిన జట్లు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ నేరుగా అర్హత సాధించాయి.

అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం 9, 10 స్ధానాల్లో  నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా నేపాల్‌, ఒమన్  ఇప్పటికే అర్హత సాధించగా.. తాజాగా నబీబియా, ఉగాండా ఈ జాబితాలో చేరాయి.
చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్‌.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు

Advertisement

తప్పక చదవండి

Advertisement