హడలెత్తించిన ఉమేశ్, సిరాజ్‌

22 Jul, 2021 05:48 IST|Sakshi

కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌ 220 ఆలౌట్‌

సెంచరీతో ఆకట్టుకున్న హమీద్‌

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: భారత బౌలర్ల ప్రాక్టీస్‌ అదిరింది. కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌ (3/22), మొహమ్మద్‌ సిరాజ్‌ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1) ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకోలేదు. భారత్‌ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ మిల్స్‌ నాలుగు వికెట్లు తీశాడు.

అవేశ్‌ ఖాన్‌ అవుట్‌
భారత యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ ఇంగ్లండ్‌ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సెలెక్ట్‌ ఎలెవన్‌ తరఫున అవేశ్‌ ఖాన్‌ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ను అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్‌ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్‌ వేలు విరిగినట్లు తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు