మన పతకాలకు మళ్లీ ఎసరు.. భారత్‌ ‘గురి’పెట్టలేదు.. ‘పట్టు’ పట్టలేదు!

13 Apr, 2022 08:23 IST|Sakshi

విక్టోరియా ‘కామన్వెల్త్‌’లోనూ నిరాశే

షూటింగ్, ఆర్చరీ సహా రెజ్లింగ్‌కు ‘నో’!

లండన్‌: ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ) మన పతకావకాశాలకు మళ్లీ ఎసరు పెట్టింది. విక్టోరియా (ఆస్ట్రేలియా) రాష్ట్రంలో జరిగే తదుపరి మెగా ఈవెంట్‌లోనూ భారత్‌ ‘గురి’పెట్టలేదు. ‘పట్టు’ పట్టలేదు. కొత్తగా బహుళ వేదికల్లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా షూటింగ్, ఆర్చరీ క్రీడాంశాలతో పాటు రెజ్లింగ్‌ను పక్కన పెట్టేశారు.

సీడబ్ల్యూజీలో భారత్‌కు పతకావకాశాలున్న ఈవెంట్లు లేకపోవడంతో మళ్లీ నిరాశనే మిగిలింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్‌హామ్‌ ఆతిథ్యమిచ్చే పోటీల్లో షూటింగ్, ఆర్చరీలను నిర్వహించడం లేదు. దీనిపై గతంలోనే భారత్‌ తమ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చింది.

ఒకానొక దశలో ‘బాయ్‌కాట్‌’ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. మొత్తం మీద బర్మింగ్‌హామ్‌ నిర్వాహకులు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)తో సంప్రదింపులు జరిపి బుజ్జగించడంతో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకో అడుగు ముందుకేసి రెజ్లింగ్‌ను తప్పించడం భారత శిబిరాన్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే.

బహుళ వేదికల్లో...
2026 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని సీడబ్ల్యూజీ ఆర్గనైజింగ్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా రాష్ట్రంలోని మెల్‌బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్‌లాండ్‌ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు.

లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) మాత్రం ఆతిథ్య, ముగింపు వేడుకలకు పరిమితమైంది. టి20 క్రికెట్‌ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్‌గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్‌ ఈవెంట్లు లేవు.

సీజీఎఫ్‌ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్‌కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్‌ (1962), బ్రిస్బేన్‌ (1982), గోల్ట్‌కోస్ట్‌ (2018)లలో మెగా ఈవెంట్స్‌ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ పోటీలు కూడా జరిగాయి.   

చదవండి: IPL 2022: థర్డ్‌ అంపైర్‌కు మతి భ్రమించిందా..?

మరిన్ని వార్తలు