Virat Kohli And Steve Smith Failure In First Two Tests Of BGT 2023 - Sakshi
Sakshi News home page

BGT 2023: వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లు స్మిత్‌, కోహ్లిలకు ఏంటీ దుస్థితి.. మరీ ఇంత దారుణమా..?

Published Tue, Feb 21 2023 5:32 PM

Virat Kohli And Steve Smith Failure In First Two Tests Of BGT 2023 - Sakshi

వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లుగా చలామణి అవుతున్న భారత, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు, స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌.. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు BGT 2023లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్‌ల్లో కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయారు.

ఈ సిరీస్‌కు ముందు ఇరువురు ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. BGT-2023లో వీరు పేట్రేగిపోవడం ఖాయమని అంతా ఊహించారు. అయితే అందరి అంచనాలకు తల్లకిందులు చేస్తూ వీరిద్దరూ దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్‌కు ముందు జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌లో స్మిత్‌.. తన శైలికి భిన్నంగా రెండు విధ్వంసకర శతకాలతో చెలరేగిపోగా.. దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో మూడంకెల స్కోర్లు చేసిన కోహ్లి.. టీ20, వన్డేల్లో శతకాలు సాధించాడు.

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో స్మిత్‌ 62 పరుగులు (37, 25 నాటౌట్‌) చేయగా.. కోహ్లి కేవలం 12 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లంతా కట్టగట్టుకుని విఫలమైనప్పటికీ.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ శతకంతో (120) చెలరేగగా, భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (70), అక్షర్‌ పటేల్‌ (84) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీలు చేసి శభాష్‌ అనిపించుకున్నారు.

బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదని ఆసీస్‌ క్రికెటర్లు నిందలు మోపిన ఈ పిచ్‌పై హిట్‌మ్యాన్‌, జడ్డూ, అక్షర్‌లు ఇరగదీసి, ఆసీస్‌ తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని ప్రపంచానికి చాటారు. న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లోనూ స్మిత్‌, కోహ్లిలు దారుణంగా నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ డకౌట్‌ కాగా.. కోహ్లి 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో అంపైర్‌ వివాదాస్పద నిర్ణయం కారణంగా కోహ్లి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 9 పరుగులు చేయగా.. కోహ్లి 20 పరుగుల వద్ద స్టంపవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ.. ఖ్వాజా (81), హ్యాండ్స్‌కోంబ్‌ (72 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (74) అర్ధసెంచరీలతో రాణించారు.

కష్టతరం అనుకున్న పిచ్‌లపై ఇతర బ్యాటర్లు, ముఖ్యంగా స్పెషలిస్ట్‌ బ్యాటర్లు కాని వారు రాణిస్తుంటే వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లు కోహ్లి, స్మిత్‌ తేలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సిరీస్‌లో కోహ్లి 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 76 పరుగులు చేయగా.. స్మిత్‌ 4 ఇన్నింగ్స్‌ల్లో 71 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్‌లో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లోనైనా స్మిత్‌, కోహ్లిలు రాణిస్తారని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement