పుజారా, రహానేల భవిష్యత్తుపై టీమిండియా కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

14 Jan, 2022 20:37 IST|Sakshi

Virat Kohli On Purane Future: దక్షిణాఫ్రితో టెస్ట్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమైన సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్‌ పుజారాలను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పరోక్షంగా వెనకేసుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం 'పురానే(పుజారా, రహానే)'ల భవిష్యత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు భారత సారధి బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పురానే భవిష్యత్తుని నిర్ణయించడం తన పని కాదని, జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వారి విషయంలో నా జోక్యం ఏంటని విలేకరులను ఎదురు ప్రశ్నించాడు. సెలక్టర్లు వారిద్దరిని జట్టులో ఎంపిక చేస్తే మాత్రం మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని బదులిచ్చాడు. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకి చాలా అవసరమని పురానేలకు పరోక్షంగా తన మద్దతు తెలిపాడు. 

కాగా, గతేడాది కాలంగా పుజారా, రహానేలు వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో వీరి ప్రదర్శన మరింత దిగజారింది. మూడు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ ఇద్దరు చేసిన పరుగులతో పోలిస్తే.. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్ట్‌ల్లో కలిపి దక్షిణాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్‌ట్రాలు సమర్పించారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు