చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్‌! | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్‌!

Published Fri, Apr 26 2024 12:32 PM

సంబరాల్లో కోహ్లి (PC: IPL)

ఐపీఎల్‌-2024లో ఎట్టకేలకు రాయల్‌ చాలెంజర్స్‌ పరాజయాలకు బ్రేక్‌ పడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ.. ఈ సీజన్‌లో రెండో గెలుపు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో నవ్వులు పూశాయి.

ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అయితే.. చిన్నపిల్లాడిలా సంతోషంతో గంతులేశాడు. రైజర్స్‌ వికెట్‌ పడిన ప్రతిసారీ పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్న కోహ్లి.. జట్టు విజయం ఖరారు కాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు స్పందనగా.. ‘‘చాలా రోజుల తర్వాత కోహ్లి మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నాం’’ అంటూ కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అర్ధ శతకం(43 బంతుల్లో 51) సాధించాడు. రజత్‌ పాటిదార్‌ (20 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. కామెరాన్‌ గ్రీన్‌(37 నాటౌట్‌) సైతం రాణించాడు.

దీంతో 206 పరుగులు స్కోరు చేసిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ను 171 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా రైజర్స్‌ విజయపరంపరకు బ్రేక్‌ వేసి.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.

ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది రెండో విజయం. సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై గెలుపొందిన ఆర్సీబీ.. మళ్లీ ఇప్పుడిలా హైదరాబాద్‌ గడ్డపై గెలుపును రుచిచూసింది. దీంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా ఉత్సాహం నిండింది.

ఇక రైజర్స్‌ సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఆరెంజ్‌ ఆర్మీతో పాటు ఆర్సీబీ 12th మ్యాన్‌ ఆర్మీ కూడా భారీగానే తరలి వచ్చింది. జట్టు జెర్సీలు ధరించి ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందాన్ని చీర్‌ చేశారు ఫ్యాన్స్‌. 

ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన ఉప్పల్‌ ప్రేక్షకులకు కోహ్లి చేతులు జోడిస్తూ ధన్యవాదాలు తెలపడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో రెండు గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. సన్‌రైజర్స్‌ ఎనిమిదింట ఐదు గెలిచి మూడో స్థానంలో ఉంది.

చదవండి: SRH Vs RCB: అరెరే.. ఏమైంది మీకు! కావ్య రియాక్ష‌న్ వైర‌ల్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement