VVS Laxman Statement Time For Rahane Give Break After Duck 4th Test - Sakshi
Sakshi News home page

'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది'

Published Mon, Sep 6 2021 11:50 AM

VVS Laxman Statement Time For Rahane Give Break After Duck 4th Test - Sakshi

లండన్‌: టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేపై భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని.. అతని స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. '' రహానేకు ఇది బ్రేక్‌ ఇవ్వాల్సిన సమయం. ప్రస్తుతం అతని ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. భవిష్యుత్తులో ఇలాగే ఉంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుంది. కోహ్లి రహానేపై నమ్మకంతో అతనికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. రహానే వాస్తవానికి మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అయితే అతను ఇప్పుడు ఫామ్‌ కోల్పోయాడు.. లయను తిరిగి అందుకోవాలంటే కొంతకాలం బ్రేక్‌ ఇవ్వాలి. నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రహానే క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడుతూనే కనిపించాడు. రహానే ఎదుర్కొన్న 8 బంతుల్లో ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ మరోసారి అలాంటి బంతే పడినప్పటికీ కనీసం అంచనా వేయలేకపోయాడు. డకౌట్‌గా వెనుదిరిగి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రహానే స్థానంలో కొన్నాళ్లు కొత్త ఆటగాళ్లైన శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలి'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ajinkya Rahane: రహానే ఎందుకిలా.. అభిమానుల ఆగ్రహం

ఇక నాలుగో టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగిన రహానే మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. గతేడాది మెల్‌బోర్న్‌ టెస్టులో చివరిసారి సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో అతని  యావరేజ్‌ 20 దాటలేదంటే ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో అర్థశతకంతో మెరిసినప్పటికీ అదే ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఇక నాలుగో టెస్టు మరింత ఆసక్తికరంగా మారింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ గెలుపుకు 291 పరుగుల దూరంలో ఉంది.

చదవండి: కోహ్లి విషయంలో మొయిన్‌ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు

Advertisement
Advertisement