WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు | ODI WC 2023 AUS Vs NED: Bas De Leede Sets Record For Most Runs Conceded in ODI Innings History - Sakshi
Sakshi News home page

WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

Published Wed, Oct 25 2023 8:05 PM

WC 2023 Aus Vs Ned: Bas De Leede Most Runs Conceded in ODI Innings History - Sakshi

WC 2023- Australia vs Netherlands: నెదర్లాండ్స్‌ స్టార్‌ క్రికెటర్‌ బాస్‌ డి లిడేకు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భాగంగా వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ఆటగాడిగా ఈ ఆల్‌రౌండర్‌ నిలిచాడు. 

ఆసీస్‌ బౌలర్లు మిక్‌ లూయీస్‌, ఆడం జంపాలను అధిగమించి చెత్త గణాంకాలతో చరిత్రకెక్కాడు. కాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన నెదర్లాండ్స్‌ ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బౌలింగ్‌ చేసింది.

ఆ ఆనందం కాసేపే
ఈ క్రమంలో డచ్‌ పేసర్‌ లోగన్‌ వాన్‌ బీక్‌ ఆస్ట్రేలియా ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు.

వాళ్లంతా ఒకెత్తు.. మాక్సీ మరో ఎత్తు
వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌(71)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అద్భుత శతకం(104)తో భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక వార్నర్‌, స్మిత్‌లతో పాటు మార్నస్‌ లబుషేన్‌ కూడా బ్యాట్‌ ఝులిపించాడు. మొత్తంగా 47 బంతుల్లో 62 పరుగులతో రాణించాడు.

నెదర్లాండ్స్‌ బౌలర్లను ఆడుకోవడంలో ఈ ముగ్గురు ఒక ఎత్తైతే ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మరో ఎత్తు. డచ్‌ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 44 బంతుల్లోనే మొత్తంగా 106 పరుగులు రాబట్టాడు. 

రెండో అత్యుత్తమ స్కోరు
వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌.. మాక్సీ.. ఇలా ఈ నలుగురి విజృంభణతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 399 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్‌ చరిత్రలో తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది.

పాపం.. బాస్‌ బలి
అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్ల పరుగుల దాహానికి బలైపోయిన బౌలర్లలో బాస్‌ డి లిడే ముందు వరుసలో ఉన్నాడు. ఈ రైట్‌ఆర్మ్‌ మీడియం పేసర్‌ తన 10 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి రికార్డు స్థాయిలో 115 పరుగులు సమర్పించుకున్నాడు. 

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బాస్‌ డి లిడే నిలిచాడు. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో లబుషేన్‌, జోష్‌ ఇంగ్లిస్‌ రూపంలో రెండు వికెట్లు తీయడం ఒక్కటే అతడికి కాస్త ఊరట. బాస్ డి లిడే సంగతి ఇలా ఉంటే.. నెదర్లాండ్స్‌  ఇతర బౌలర్లలో వాన్‌ బీక్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆర్యన్‌ దత్‌కు ఒక్క వికెట్‌ దక్కింది.

ఇంటర్నేషనల్‌ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు వీరే
►2/115 (10) - బాస్‌ డి లిడే(నెదర్లాండ్స్‌)- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో- ఢిల్లీ-2023
►0/113 (10) - మిక్‌ లూయిస్‌(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- జొహన్నస్‌బర్గ్‌- 2006
►0/113(10) - ఆడం జంపా(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- సెంచూరియన్‌- 2023
►0/110 (10)- వాహబ్‌ రియాజ్‌(పాకిస్తాన్‌)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- నాటింగ్‌హాం- 2016
►0/110 (9) - రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- మాంచెస్టర్‌- 2019.

చదవండి: WC 2023: వార్నర్‌ 22వ సెంచరీ.. రికార్డులు బద్దలు! సచిన్‌తో పాటు

Advertisement
Advertisement