Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి | Sakshi
Sakshi News home page

Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి

Published Thu, Oct 19 2023 10:11 PM

WC 2023 Ind Vs Ban: Kohli On 78th Century Sorry For Stealing It From Jaddu - Sakshi

ICC ODI WC 2023- Virat Kohli: ‘‘విజయంలో కీలక పాత్ర పోషించాలని భావించాను. జడ్డూ నుంచి ఈ అవార్డు దొంగిలించినందుకు క్షమాపణలైతే చెప్పాల్సిందే మరి! నిజానికి వరల్డ్‌కప్‌ టోర్నీల్లో నేను కొన్నిసార్లు ఫిఫ్టీలు సాధించాను.

కానీ వాటిని శతకాలుగా మలచలేకపోయాను. చివరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాలనుకున్నాను. వాస్తవానికి చాలా ఏళ్లుగా జట్టు కోసం నేను చేస్తున్నది కూడా ఇదే!

ఈరోజు నిజంగా నాకిది కలలాగే ఉంది. ఎదుర్కొన్న తొలి నాలుగు బంతుల్లో రెండు ఫ్రీ హిట్లు.. ఒక సిక్స్‌.. ఒక ఫోర్‌. పుణె పిచ్‌ చాలా బాగుంది. నా సహజశైలిలో గేమ్‌ ఆడేందుకు వెసులుబాటు కల్పించింది.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడం.. అదునుచూసి గ్యాప్స్‌ మధ్య బంతిని బౌండరీ దిశగా తరలించి పరుగులు రాబట్టడం.. డ్రెస్సింగ్‌ రూంలో వాతావరణం చాలా చాలా బాగుంది. ఆటగాళ్లంతా ఒకరి కంపెనీని మరొకరు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. అదే సమన్వయం, సహకారం మైదానంలోనూ కనిపిస్తోంది. కో- ఆర్డినేషన్‌తో ముందుకు వెళ్లగలుగుతున్నాం.

నాకైతే ఇక్కడ హోం గ్రౌండ్‌లో ఆడినట్లే అనిపిస్తోంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు మరువలేనిది. ఈ టోర్నీలో మేమింకా ముందుకు వెళ్లాల్సి ఉంది. ఏదేమైనా ఈరోజు ఇలా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహి​ హర్షం వ్యక్తం చేశాడు.

వరుసగా నాలుగో విజయం
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాను 256 పరుగులకు కట్టడి చేసిన భారత్‌.. 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ 48, శుబ్‌మన్‌ గిల్‌ 53 పరుగులతో రాణించగా.. రన్‌మెషీన్‌ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 103 పరుగలతో నాటౌట్‌గా నిలిచాడు. 

రాహుల్‌ సహకారంతోనే సాధ్యమైంది
అయితే, శతకానికి చేరువయ్యే క్రమంలో కేఎల్‌ రాహుల్‌(34- నాటౌట్‌) కోహ్లికి పూర్తి సహకారం అందించాడు. ఈ క్రమంలో టార్గెట్‌కు దగ్గరవుతున్న కొద్దీ స్ట్రైక్‌ రొటేట్‌ కాకుండా జాగ్రత్తపడిన.. కోహ్లి ఎట్టకేలకు 41.3 ఓవర్లో సిక్సర్‌ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

స్పెషల్‌ ఇన్నింగ్స్‌ 
అంతర్జాతీయ కెరీర్‌లో 78వ, వన్డేల్లో 48 శతకం నమోదు చేసి రికార్డులు బద్దలు కొట్టాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న తరుణంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

జడ్డూ కూడా అర్హుడే
బంగ్లా ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో కీలక వికెట్లు తీసిన రవీంద్ర జడేజా కూడా ఈ అవార్డుకు అర్హుడన్న నేపథ్యంలో అతడికి కింగ్‌ కోహ్లి సారీ చెప్పడం విశేషం. ఇక వరల్డ్‌కప్‌ ఛేజింగ్‌లో కోహ్లికి ఇదే తొలి శతకం కావడం గమనార్హం. 

చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్‌.. పాండ్యా అవుట్‌! బీసీసీఐ ప్రకటన 

Advertisement
Advertisement