WC 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌! | ICC Cricket World Cup 2023 Pakistan Vs South Africa: Pak Pacer Hasan Ali Ruled Out Due To This Reason - Sakshi
Sakshi News home page

WC 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Published Fri, Oct 27 2023 12:47 PM

WC 2023 Pak vs SA: Pak Pacer Hasan Ali Ruled Out Due To This Reason - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌ స్టార్‌ పేసర్‌ హసన్‌ అలీ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న కారణంగా సౌతాఫ్రికాతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు.

ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది. ‘‘ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి సౌతాఫ్రికాతో పాకిస్తాన్‌ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. కాగా యువ పేసర్‌ నసీం షా గాయం కారణంగా వరల్డ్‌కప్‌-2023 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అతడి స్థానంలో అనూహ్యంగా హసన్‌ అలీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 29 ఏళ్ల ఈ రైటార్మ్‌ పేసర్‌ తాజా ప్రపంచకప్‌ ఈవెంట్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి 5.82 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌) వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. సౌతాఫ్రికాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ప్రొటిస్‌ జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. వరుస ఓటములతో డీలా పడ్డ పాక్‌ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి! ఇక ఈ మ్యాచ్‌లో హసన్‌ అలీ స్థానంలో మహ్మద్‌ వసీం జూనియర్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి: WC 2023: కోహ్లిలా ఉండాలన్నందుకు.. నాపై ద్రోహి అనే ముద్ర వేశారు! కానీ..

Advertisement
Advertisement