పాకిస్తాన్‌దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి కారణంగా.. | Sakshi
Sakshi News home page

Ind Vs Pak: పాక్‌దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి అద్భుతంగా... ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అతడే!

Published Fri, Sep 1 2023 3:41 PM

When India Met Pakistan In Asia Cup For First Time What Happened History - Sakshi

భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌.. దాయాదుల మధ్య క్రికెట్‌ పోరుకు ఉన్న క్రేజే వేరు. గెలుపు కోసం చిరకాల ప్రత్యర్థులు మైదానంలో పోటాపోటీగా ముందుకు సాగుతూ ఉంటే అభిమానులకు కన్నులపండుగగా ఉంటుంది. హై వోల్టేజీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని ఇరు దేశాల క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.

అలాంటి హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2(శనివారం)న ఆసియా కప్‌-2023 వన్డే టోర్నీలో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్‌- పాకిస్తాన్‌ సిద్ధమయ్యాయి. ఇప్పటికే నేపాల్‌పై విజయంతో పాకిస్తాన్‌ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉండగా.. రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌తోనే ఈవెంట్‌ను ఆరంభించనుంది.

ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆ మ్యాచ్‌లో విజేత ఎవరు? ఆసియా కప్‌ చరిత్రలో ఆధిపత్యం ఎవరిది? ఓవరాల్‌గా వన్డేల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? తదితర అంశాలు గమనిద్దాం.

తొలిసారి అక్కడే
బలూచిస్తాన్‌లోని క్వెటా వేదికగా 1978లో తొలిసారి భారత్‌, పాకిస్తాన్‌ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై 4 పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించింది.

పాకిస్తాన్‌దే పైచేయి!
ఇక ఇప్పటి వరకు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మొత్తంగా 132 వన్డేలు జరుగగా.. 73 మ్యాచ్‌లలో పాక్‌ విజయం సాధించింది. టీమిండియా 55 మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిసిపోయాయి.

తొట్టతొలి విజేత భారత్‌
ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌ టోర్నీలో మాత్రం భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. 1984లో షార్జాలో ఆరంభమైన ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా పాక్‌తో తొలిసారి తలపడింది. నాటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 54 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొట్టతొలి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

నాడు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అతడే
ఆనాడు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సురీందర్‌ ఖన్నా 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సందీప్‌ పాటిల్‌ 43 రన్స్‌తో రాణించాడు. నాటి కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ 36 పరుగులు సాధించగా.. గులాం పార్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ వరుసగా 22, 14 పరుగులు చేశారు.

పాకిస్తాన్‌ జట్టులో సర్ఫరాజ్‌ నవాజ్‌, షాహిద్‌ మహబూబ్‌, ముదాసర్‌ నాజర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ క్రమంలో 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 39.2 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్‌ అయింది. మొహ్సిన్‌ ఖాన్‌ 35 పరుగులు చేయగా.. కెప్టెన్‌ జహీర్‌ అబ్బాస్‌ 27 పరుగులు సాధించాడు. 

రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి మ్యాజిక్‌
మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పాక్‌ తక్కువ స్కోరుకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా బౌలర్లలో పేసర్‌ రోజర్‌ బిన్నీ, స్పిన్నర్‌ రవిశాస్త్రి ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. చెరో మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక నలుగురు బ్యాటర్లు రనౌట్ల రూపంలో వెనుదిరగడంతో పాక్‌ కథ ముగిసిపోయింది. టైటిల్‌ భారత్‌ సొంతమైంది.

ఆసియాలో టీమిండియాదే హవా
ఓవరాల్‌గా వన్డేల్లో పాకిస్తాన్‌ ఆధిక్యంలో ఉన్నా ఆసియా కప్‌ టోర్నీలో మాత్రం భారత్‌ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఏడుసార్లు టైటిల్‌ గెలిచిన ఘనత టీమిండియాది. ఇందులో ఆరు వన్డే, ఒక టీ20 ట్రోఫీ ఉన్నాయి.

పాక్‌ కేవలం రెండుసార్లు
రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఈవెంట్‌లో 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇక పాకిస్తాన్‌ ఇప్పటి వరకు 2000, 2012లో.. అంటే రెండుసార్లు మాత్రమే చాంపియన్‌గా నిలిచింది. 2000 ఫైనల్లో శ్రీలంకను 39 పరుగులు, 2012లో బంగ్లాదేశ్‌ను 2 పరుగులతో ఓడించి టైటిల్‌ గెలిచింది.

ముఖాముఖి పోరులో
ఇక ముఖాముఖి పోరులో 1984- 2022 వరకు భారత్‌- పాకిస్తాన్ వన్డే పోరులో 13 మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. పాక్‌ ఐదుసార్లు విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దైపోయింది. 

చదవండి: వన్డేల్లో ఏకైక బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు.. మరి ఆసియా కప్‌లో? ఈ గణాంకాలు చూస్తే 

Advertisement

తప్పక చదవండి

Advertisement