Who Is The Main Reason Behind Kohli, Naveen, Gambhir Issue? - Sakshi
Sakshi News home page

LSG VS RCB: కోహ్లి-నవీన్‌-గంభీర్‌లలో తప్పెవరిది..?

Published Tue, May 2 2023 7:00 PM

Who Is The Main Cause In Kohli, Naveen, Gambhir Issue - Sakshi

కోహ్లి-నవీన్‌ ఉల్‌ హాక్‌-గంభీర్‌ల మధ్య నిన్నటి (మే 1) మ్యాచ్‌ (ఎల్‌ఎస్‌జీ వర్సెస్‌ ఆర్సీబీ) సందర్భంగా చోటు చేసుకున్న వివాదం, ఆ తదనంతర పరిణామాలు జెంటిల్మెన్‌ గేమ్‌కు మాయని మచ్చగా మిగిలిపోనున్నాయి. దిగ్గజ క్రికెట్‌గా వేనోళ్ల కీర్తించబడుతున్న విరాట్‌ కోహ్లి తన స్థాయిని మరిచి గొడవకు బీజం వేస్తే.. నవీన్‌ ఉల్‌ హాక్‌ను సాకుగా చూపి గంభీర్‌ గొడవను పెద్దది చేసి భారత క్రికెట్‌ పరువును బజారుకీడ్చాడు. 

కోహ్లి-నవీన్‌ వివాదాన్ని గంభీర్‌ ఆటలో భాగంగా చూసుంటే ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యేది కాదు. అయితే కోహ్లి అంటే మొదటి నుంచి సరిపోని గంభీర్‌.. ఉద్దేశపూర్వకంగానే కోహ్లితో గొడవను ప్రొలాంగ్‌ చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు కోహ్లి.. నవీన్‌ను కవ్వించడంతో ఈ గొడవ మొదలయ్యుండకపోవచ్చు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనే ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ (ఏప్రిల్‌ 10) అనంతరం ఈ గొడవ స్టార్ట్‌ అయ్యిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 
(చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్‌ గొడవకు మూల కారకుడు?)

నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. లక్నో విజయానంతరం ఆ జట్టు మెంటార్‌ గంభీర్‌.. ఆర్సీబీ అభిమానులను వారి సొంతగడ్డపై హేలన చేసేలా వ్యంగ్యమైన సంబరాలు చేసుకున్నాడు (నోరు మూయండి అన్నట్లు). సాధారణంగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చే అలవాటున్న కోహ్లి.. నిన్నటి మ్యాచ్‌ ఆరంభం నుంచే గంభీర్‌పై రివెంజ్‌కు ప్లాన్‌ చేశాడు. 

అందులో భాగంగానే లక్నో వికెట్‌ కోల్పోయిన ప్రతిసారి స్టేడియంలోని ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ తనదైన స్టయిల్‌లో గంభీర్‌కు చురక తగిలేలా ప్రవర్తించాడు. ఇది మనసులో పెట్టుకునే గంభీర్‌.. నవీన్‌ ఇష్యూను హైలైట్‌ చేసి, కోహ్లిపై పైచేయి సాధించాలని చూశాడు. మరోపక్క నవీన్‌ సైతం గంభీర్‌ అండ చూసుకుని సీనియర్‌ అన్న గౌరవం కూడా లేకుండా కోహ్లితో ఇష్టవచ్చినట్లు ప్రవర్తించాడు. మరి ఈ తంతు గురించి పూర్తిగా తెలిసాక తప్పెవరిదో, ఒప్పెవరిదో మీరే చెప్పండి. 
(కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..!)

Advertisement
Advertisement