Women's Cricket World Cup 2022: India Lose by 3 Wickets Against South Africa, Crash Out of Tournament - Sakshi
Sakshi News home page

World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. తప్పని ఓటమి.. వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి భారత్‌ అవుట్‌

Published Sun, Mar 27 2022 2:07 PM

Women World Cup 2022: India Lost To South Africa By 3 Wickets Out Of Tourney - Sakshi

ICC Women World Cup 2022 Ind W Vs Sa W: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భారత్‌కు భంగపాటు తప్పలేదు. సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేనకు నిరాశే ఎదురైంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం దక్షిణాఫ్రికానే వరించింది. మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో భారత మహిళా జట్టు సెమీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివరి వరకు పోరాడిన మిథాలీ సేన పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టాస్‌ గెలిచి శుభారంభం
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(68), వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ 48 పరుగులతో రాణించారు. 

ఈ క్రమంలో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మెరుగైన స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్‌ రెండు, అయబోంగా  ఒకటి, ట్రియాన్‌కు ఒకటి, మసబాట క్లాస్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

నరాలు తెగే ఉత్కంఠ
ఆరంభంలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లిజెలీ లీను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌ చేయడంతో భారత్‌కు మంచి బ్రేక్‌ వచ్చింది. కానీ మరో ఓపెనర్‌ లారా వొల్వార్డ్‌ 80 పరుగులు సాధించి పటిష్ట పునాది వేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారా గుడాల్‌ సైతం 49 పరుగులు సాధించగా.. కీలక సమయంలో మిగ్నన్‌డు ప్రీజ్‌ 52 పరుగులతో రాణించి అజేయంగా నిలిచింది.

ఆఖరికి
మరోవైపు.. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో తొలిసారి బౌలింగ్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వికెట్లు తీస్తూ.. రనౌట్లలో భాగం కావడం ముచ్చటగొలిపింది. హర్మన్‌ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు భారత్‌ పోరాడగలిగింది.

అయితే, 49.5వ ఓవర్లో దీప్తి శర్మ నోబాల్‌ వేయడంతో భారత్‌ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతికి డు ప్రీజ్‌ సింగిల్‌ తీయడంతో భారత్‌ పరాజయం ఖరారైంది. దీంతో టోర్నీ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగింది.

స్కోర్లు: ఇండియా- 274/7 (50)
దక్షిణాఫ్రికా- 275/7 (50)

Advertisement
Advertisement