కాశ్వీ బన్‌గయీ కరోడ్‌పతి | Sakshi
Sakshi News home page

కాశ్వీ బన్‌గయీ కరోడ్‌పతి

Published Sun, Dec 10 2023 4:16 AM

In WPL auction Chandigarh Pacer fetched Rs 2 crores - Sakshi

ముంబై: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌ కోసం జరిగిన మినీ వేలంలో ఇద్దరు భారత యువ క్రీడాకారిణుల పంట పండింది. చండీగఢ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ కాశ్వీ గౌతమ్, కర్నాటక బ్యాటర్‌ వృందా దినేశ్‌ల పంట పండింది. కాశ్వీని గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు ఎంచుకోగా...వృందాను రూ.1 కోటి 30 లక్షలకు యూపీ వారియర్స్‌ తీసుకుంది.

ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి అనాబెల్‌ సదర్లాండ్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 2 కోట్లకే తమ జట్టులోకి చేర్చుకుంది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నా... శ్రీలంక కెపె్టన్‌ చమరి అటపట్టును వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. మొత్తం 165 మంది ప్లేయర్లు మహిళల లీగ్‌లో వేలం కోసం అందుబాటులోకి రాగా ఐదు జట్లూ కలిపి 30 మందిని ఎంచుకున్నాయి. వీరిలో 9 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.  

వారిద్దరికి ఎందుకంటే... 
గత సీజన్‌ వేలంలో భారత కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు వేలంలో రూ.1.80 కోట్లు పలకగా, ఇప్పటి వరకు భారత్‌కు ఆడని (అన్‌క్యాప్డ్‌) కాశ్వీకి  అంతకంటే ఎక్కువ మొత్తం లభించడం విశేషం. సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన  కాశ్వీ కోసం అన్ని జట్లూ పోటీ పడ్డాయి. గత నెలలో జాతీయ టి20 టోర్నీ లో 12 వికెట్లు తీసిన కాశ్వీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ‘ఎ’ సిరీస్‌లో ఆడింది.

అంతకు ముందు ఆసియా కప్‌ అండర్‌–23లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యురాలు. కాశ్వీ కనీస ధర రూ. 10 లక్షలతో వేలం మొదలు కాగా, ప్రధానంగా పోటీ యూపీ, గుజరాత్‌ మధ్యే  నడిచింది. చివరకు గుజరాత్‌ ఆమెను సొంతం చేసుకుంది. మూడేళ్ల క్రితం అండర్‌–19 వన్డేలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రికార్డు కాశ్వీకి ఉంది.

22 ఏళ్ల వృంద దూకుడైన బ్యాటింగ్‌కు మారపేరు. గత రెండు సీజన్లుగా నిలకడగా ఆడిన వృంద ఈ ఏడాది సీనియర్‌ వన్డే టోర్నీ లో 477 పరుగులతో కర్నాటక ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించింది. అనాబెల్‌ ఆసీస్‌ తరఫున 23 వన్డేలు, 22 టి20లు ఆడింది.  

మన ప్లేయర్లు ముగ్గురు... 
భారత్‌ తరఫున 17 టి20లు ఆడిన ఆంధ్ర ఓపెనర్‌ సబ్బినేని మేఘనను బెంగళూరు రూ. 30 లక్షలకు, ఇంకా సీనియర్‌ స్థాయిలో ఆడని హైదరాబాద్‌ బ్యాటర్‌ ఏడుకొండల త్రిష పూజితను గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 10 లక్షలకు తీసుకున్నాయి.

2008నుంచి 2014 మధ్య భారత్‌ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన 35 ఏళ్ల హైదరాబాద్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ గౌహర్‌ సుల్తానాను రూ. 30 లక్షలకు యూపీ వారియర్స్‌ ఎంచుకోవడం విశేషం. మరో హైదరాబాద్‌ అమ్మాయి గొంగిడి త్రిష మాత్రం వేలంలో ఎంపిక కాలేదు.  

వేలంలో టాప్‌ 
అనాబెల్‌ (ఆ్రస్టేలియా) – రూ. 2 కోట్లు 
కాశ్వీ గౌతమ్‌ (భారత్‌) – రూ. 2 కోట్లు 
వృంద దినేశ్‌ (భారత్‌) – రూ.1.30 కోట్లు 
షబ్నమ్‌ (దక్షిణాఫ్రికా) – రూ. 1.20 కోట్లు 
ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (ఆస్ట్రేలియా) – రూ. 1 కోటి 
ఏక్తా బిస్త్‌ (భారత్‌) – రూ. 60 లక్షలు 
వేర్‌హమ్‌ (ఆ్రస్టేలియా) – రూ. 40 లక్షలు 

Advertisement
Advertisement